11 May, 2026 | 1:32 AM

విద్యుత్ బిల్లు ఆదా కోసం కల్తీ పాలు

11-05-2026 12:25 AM

నిందితుడి అరెస్ట్

కందుకూరు, మే 10 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పాలను కల్తీ చేసి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కందుకూరు సీఐ హెచ్. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో గల యాదవ డైరీ పాల కేంద్రంలో గత కొంతకాలంగా కల్తీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  పాల కేంద్రంలో తనిఖీలు చేపట్టిన సమయంలో మారమోని శ్రీశైలం అనే వ్యక్తి వద్ద అనుమానాస్పద రసాయన డబ్బాలు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని పరిశీలించగా అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తేలింది.

నిందితుడి విస్తుపోయే వాంగ్మూలం..

రాత్రి వేళల్లో రైతుల వద్ద సేకరించిన పాలు మరుసటి రోజు ఉదయం వరకు పాడవకుండా ఉండేందుకు ఈ రసాయనాన్ని వాడుతున్నట్లు ఒప్పుకున్నాడు. పాలను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే నెలకు రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు విద్యుత్ బిల్లు వస్తుందని, అదే కేవలం రూ. 150 ఖర్చుతో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే పాలు నిల్వ ఉంటాయని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కల్తీ పాలను ప్రతిరోజూ హైదరాబాద్లోని పలు హోటళ్లకు తరలించి విక్రయిస్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు. పోలీసులు నిందితుడి నుండి 80 లీటర్ల కల్తీ పాలు, 300 మి.లీ. హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ‘ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా నిషేధిత రసాయనాలు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కల్తీ పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.