11 May, 2026 | 1:33 AM

ఆడబిడ్డ పెళ్లికి అండగా కల్యాణ కానుక

11-05-2026 12:27 AM

మొయినాబాద్, మే 11 (విజయ క్రాంతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 11వ వార్డు కౌన్సిలర్ మద్యపాగు మహేష్ ఆదివారం ఆడబిడ్డ కళ్యాణ కానుక పథకం కింద తొలి చెక్కును అందజేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన ఎలుకల ఎల్లమ్మ  నరసింహ దంపతుల కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.25 వేల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మద్యపాగు మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. వార్డులోని అర్హులైన ప్రతి ఆడబిడ్డ వివాహానికి కళ్యాణ కానుక పథకం ద్వారా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడటమే లక్ష్యమని, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఉంటున్న కౌన్సిలర్ మద్యపాగు మహేష్ను వార్డు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.