కోవిడ్ తర్వాత.. మతిమరుపు నిజమేనా?
మిమ్మల్ని ఎక్కడో చూశానండి...? మీ పేరేంటి.. నన్ను గుర్తుపట్టారా..! ఇక్కడే నా ఫోన్ పెట్టానండి.. ఎక్కడుందో ఏమో..? పడుకునే ముందు తలుపులు పెట్టామా.. లేదా! సిలిండర్ ఆఫ్ చేశామో లేదో అని మళ్లీ మళ్లీ చెక్ చేసుకోవడం. ఇలా ఒక్కటేమిటి ప్రతిదాంట్లో మతిమరుపు మనల్ని మానసికంగా వేధిస్తోంది.. ఇది ఒక్కరి సమస్యే అనుకుంటే పొరపాటు చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది. ఒక న్యాయశాస్త్ర విద్యారిన్థి చెప్తున్న మాటలు.. “కోవిడ్‌కు ముందు నేను అన్నింట్లో టాప్ వన్‌లో ఉండేదాన్ని.. ప్రతిది జాగ్రత్తగా చదువుకొనేదాన్ని కానీ కోవిడ్ ఆఫ్టర్ నా ర్యాంకు స్కోర్ తగ్గింది. ఏకాగ్రతగా చదవలేకపోతున్నా, ఈజీగా మర్చిపోతున్నాను” అని చెప్తుంది. కోవిడ్ తర్వాత మతిమరుపు నిజమేనా..? ఇది మానసికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని సైకాలజిస్ట్ హరిష్ మాటల్లో తెలుసుకుందాం..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రముఖ మానసిక సంస్థ అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ జరిపిన పరిశోధనల్లో నేరుగా వ్యాక్సినేషన్, మతిమరుపుకు సంబంధించిన పరిశోధనలు ఎటువంటివి జరగలేదు. కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపైనా ప్రతికూల ప్రభావం చూపిందనటానికి అనేక పరిశోధనలు జరిగాయి. అంటే హృదయ నాళాల్లో రక్తం గడ్డకట్టడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నేరుగా కాకుండా మనిషి పరోక్షంగా మతిమరుపు మీద ప్రభావం చూపాయి.
మతిమరుపుకు కారణమేంటి?
దీనిపై కూడా WHO అనేక పరిశోధనలు జరిపింది. మతిమరుపులో ప్రధానంగా సైకాలజీలో అల్జీమర్స్ డిజార్డర్, డెమెన్షియా ఈ రెండు ప్రధాన వ్యాధులుంటాయి. ఈ వ్యాధు లు ఇంతకు ముందు ఉన్నవారిలో మరింత పెరిగాయి. కొత్తవారిలో కూడా ఈ మొమోరీ లాస్ సమస్యలు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే ఒకటి సోషల్ ఐసొలేషన్ కావొచ్చు, అలవాట్లలో మార్పు లు రావడం, ప్రత్యేకంగా ఆహారపు అలవాట్లు మార డం, జంక్ ఫుడ్ కు అలవాటు పడటం, తర్వాత శారీరక వ్యాయమాలు చేయకపోవడం వల్ల మతిమరుపు రావడం జరుగుతుంది. సహజంగా మెదడుకు రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందో అప్పుడు అది మన మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది.
ఇది కూడా మతిమరుపుకు ఓ కారణంగా చెప్పొచ్చు. మతిమరుపు అనేది ప్రధానంగా యువకులు, చిన్న పిల్లలకంటే 30 ఏళ్ల మధ్య వయసు వారిలో అత్యధికంగా ఉంది. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకంటే పురుషుల్లో మెమొరీ లాస్ అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయ డం వల్ల మతిమరుపు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామం, మెడిటేషన్ చేస్తున్నారో వారితో పోల్చితే చేయని వారిలో ఎక్కువ మతిమరుపు ఉండే అవకాశం కనిపిస్తోంది. కొవిడ్ తర్వా త ముఖ్యంగా నిద్ర సమయం చాలా తగ్గిపోయింది. ఎంత సేపు పడుకున్నామనే దానికంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంత అనేది మనం చూస్తాం. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. హెల్తీ డైట్ కూడా చాలా ముఖ్యం.
మెదడుకు ఉండే గొప్ప లక్షణం
మన మెదడుకు ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే మనం ఏది గుర్తు పెట్టుకొమని ఫీడ్ ఇస్తే అది గుర్తు పెట్టుకుంటుంది. ఏది మర్చిపోమంటే అది మర్చిపోతుంది. దానికి ఓ ఉదాహరణ ఏదంటే చిన్నప్పుడు పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టు ఎక్కువ గుర్తుంటుంది, ఇష్టం లేని సబ్జెక్టు వెంటనే మరిచిపోతారు. ఎందుకంటే అది వాళ్ల ఆసక్తిని, ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పరీక్షల సమయంలో ఆందోళన పడటం వల్ల సగం మర్చిపోతారు. వీలైనంత ప్రశాంతంగా ఉండటం వల్ల ఎక్కువ గుర్తుంచుకునే అవకాశం ఉంది. చాలామంది గొప్పవాళ్లకుండే లక్షణం చూస్తే రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవడం.. ఇలా చేయడం వల్ల ఓ ప్రణాళిక అలవడుతుంది. కొత్త అలవాట్లు నేర్చుకోవాలి.. ఒక భాష నేర్చుకోవడం, సంగీతం, డ్యాన్స్ లేదా స్విమ్మింగ్ వంటివి నేర్చుకోవడం వల్ల కూడా మెమొరీ పెరుగుతుంది. ఏదైతే వాడని పని ముట్టు తుప్పు పట్టిపోతుందో అలానే మెదడు కూడా అంతే మనమెంత యాక్టివ్‌గా దాన్ని వాడుతుంటామో అంతే యాక్టివ్‌గా అది పని చేస్తుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి!
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి. మెదడు మందుభాగం కుంచించుకు పోతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తిని ప్రభావితం చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. నిరంతరం పనిలో మునిగితేలే వ్యక్తులు, ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే ‘నో’ చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. వెంటనే ఈ తీరు మార్చుకోండి. అదనపు ఒత్తిడిని వదిలేయండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొందరు మెదడుకు ఒత్తిడి కలిగించే పనుల్ని చేస్తూనే ఉంటారు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు పని చెప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు, అనారోగ్యాన్ని తగ్గించే పనిలో బిజీగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పనికి సెలవు ఇవ్వాలి. లేని పక్షంలో మెదడుపై దీర్ఘకాలిక దుష్ఫ్రభావాలు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రభావం ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డెమెన్షియా కూడా రావొచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి. మెదడు మందుభాగం కుంచించుకుపోతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తిని ప్రభావితం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొందరు మెదడుకు ఒత్తిడి కలిగించే పనుల్ని చేస్తూనే ఉంటారు.
క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గడం?
మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది. సహజంగా నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. ఏడు గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది. మెదడును రక్షించుకోవాలంటే ఒక్కటే మార్గం. రోజూ రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోవడమే దీనికి పరిష్కారం. ఎనిమిది గంటలు నిద్రపోతే ఇంకా మంచిది.
టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం
మన ముందు తరం వారు క్యాలిక్యులేటర్లు వాడకుండా చిన్న చిన్న లెక్కలు చేయడం, ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం, అధికంగా పుస్తకాలు చదవడం వంటివి చేసేవారు. వారికి జనరల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుండేది. ఇలాంటి అలవాట్లన్నీ మెదడుకు వ్యాయామం లాంటివి. ఇవి మెదడు ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచుతాయి. కానీ ఈ తరంలో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం మన మెదడు సామర్థ్యాన్ని తగ్గించింది. ఫలితంగా రోజురోజుకు జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి క్షీణిస్తున్నాయి. మెదడును చురుగ్గా ఉంచుకోవాలంటే గూగుల్ మీద ఆధారపడకుండా మీరే అన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వీటితో పాటు వర్డ్ జంబుల్, పజిల్ మ్యాచింగ్, సుడోకు వంటివి మెదడుకు పని కల్పించే ఆటల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
హరీష్ ఆజాద్,
సైకాలజిస్ట్(ఆర్‌సీఐ)
నిశా






