12 July, 2026 | 8:05 PM

పునర్విభజన తర్వాత అత్యధిక స్థానాలు సాధిస్తాం

10-06-2024 12:51 AM

సామాన్య కార్యకర్తల పోరాటం వల్లే ఎంపీలుగా గెలిచాం

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం..

ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 ఎంపీ స్థానాలు సాధించి రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటిందని... 2028 శాసన సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకునడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ 88 శాసనసభ స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ పునర్విభజన జరుగుతుందని, సీట్లు పెరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. చాలా మందికి పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందని, బీజేపీ ఘన విజయం సాధించేందుకు అవకాశం ఉండబోతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. తెలంగాణకు రెండు మంత్రి పదవులను ఇచ్చినందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

సామాన్య కార్యకర్త నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రిగా తీసుకునడం చూస్తే బీజేపీ పనితీరు అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురు కేంద్ర మంత్రులు కూడ సాధారణ కార్యకర్తలేనని తెలిపారు. బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తుందని చెప్పేందుకు కేంద్ర మంత్రుల ఎంపికనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తమను గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి బీజేపీ అధిష్ఠానం కేంద్ర మంత్రులుగా నియమించిందన్నారు. తమది రాజకీయ వారసత్వ కుటుంబం కాదని తెలిపారు.

రానున్న రోజుల్లోనూ బీజేపీ ఇదే స్థాయిలో పనిచేసి ముందుకు సాగుతుందన్నారు. సంకల్ప్ పత్ పేరిట ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా బీజేపీ అమలుచేస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది రెండోసారి మాత్రమేనని ఆ ఘనత ఆయనకే సాధ్యమైందని, ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. బీజేపీని ఏర్పాటు చేసినప్పుడు ఈ స్థాయిలో పార్టీ పురోగతి సాధిస్తుందని తాము ఊహించలేదని అన్నారు. దేశాభివృద్ధిలో నరేంద్రమోదీ పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు. 

మూడోసారి ప్రధానిగా బాద్యతలు స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియచేశారు. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి విజయం సాధించిందని... కూటమిలోని పార్టీలకు కేంద్ర కేబినెట్ లో  అవకాశం ఇచ్చామన్నారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా తెలంగాణలో సుమారు 35 శాతానికి పైగా ఓట్లతో, అత్యధిక సీట్లు సాధించడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. బిజెపి విజయానికి దోహదపడ్డ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు, రాష్ర్ట నాయకులు, కార్యకర్తలు అందరికి ధన్యవాదాలు తెలిపారు. 

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం మజ్లిస్ పార్టీ పూర్తిస్థాయిలో పనిచేసిందని... కాంగ్రెస్ ముసుగులో బిజెపి ని ఓడించే ప్రయత్నం చేసిన మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని విజయం సాధించామన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం కొలువుదీరుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ర్టంలోనూ అన్ని మండల కేంద్రాల్లో సంబురాలు నిర్వహించాలని కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.