17 July, 2026 | 3:59 PM

భాగ్యనగరం ఎప్పటికి తేరుకొనాలా?

04-06-2024 03:56 AM

మళ్లీ ముంచుకొస్తున్న నాలాల ముప్పు

10 శాతం కూడా పూర్తికాని పూడికతీత 

  • చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయం 
  • ఎస్‌ఎన్‌డీపీలో రూ.985 కోట్ల కేటాయింపు 
  • రూ.56 కోట్లతో పూడిక తొలగింపు పనులు
  • భారీ వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలకు తప్పని ముంపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ ౩ (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు నాలాలు పొంగుతాయి. డ్రైనేజీలు ఉప్పొంగుతాయి. రోడ్లన్నీ జలమయం అవుతాయి. కాలనీలు, బస్తీలన్నీ వరద నీటితో మునిగిపోతాయి. సముద్ర ప్రయాణంలా బోట్లతోనే సహాయక చర్యలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఓ మోస్త రు వర్షానికే రోడ్లపై వరదలు నదుల్లా పారుతున్నాయి. ఈ వరదలకు నాలాల్లో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. నగరానికి వర్ష సూచన ఉందం టేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

దశాబ్దాలుగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ వరద కష్టాలను తీర్చడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమవుతూనే ఉన్నారు. హైటెక్ హంగులతో హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దినట్టు గొప్పలు చెప్పుకునే పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. నగర అభివృద్ధికి, నాలాలోని వరద నీరు సక్రమంగా పారేందుకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా మురుగునీటి పాలే అవుతున్నాయి. 

ఆచరణలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రమాదాలు మళ్లీ, మళ్లీ పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలతో నాలాలన్నీ కుంచించుకుపోతున్నా, వ్యర్థాలతో నిండిపోతున్నా అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం ముంచు కొస్తున్న నేపథ్యంలో నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఎస్‌ఎన్‌డీపీలో రూ. 985 కోట్లు కేటాయింపు

గ్రేటర్ హైదరాబాద్‌లో 1302 కిలోమీటర్ల దాకా నాలాల్లో వరద నీరు ప్రవహిస్తున్నది. వీటిలో 390 కిలోమీటర్లు మేజర్ నాలాలు ఉండగా, మరో 912 కిలోమీటర్లు మైనర్ నాలాలున్నాయి. ఎస్‌ఎన్‌డిపి ప్రోగ్రాంలో భాగంగా నాలాలపై స్లాబ్‌లు, నాలాలను పటిష్టవంతంగా మెరుగుపర్చేందుకు 58 పనులకు రూ. 985.45 కోట్లను కేటాయించారు. గ్రేటర్ పరిధిలో 747.45 కోట్లతో ఎల్‌బీ నగర్ జోన్‌లో 10, చార్మినార్ జోన్‌లో 7, ఖైరతా బాద్ జోన్‌లో 7, కూకట్‌పల్లి జోన్‌లో 3, సికింద్రాబాద్ జోన్‌లో 8, శేరిలింగంపల్లి జోన్‌లో 2 పనులు ప్రారంభించారు.

ఓఆర్‌ఆర్ పరిధి మీర్‌పేట, బడంగ్‌పేట, జల్‌పల్లి, పెద్ద అంబరుపేట, నిజాంపేట, కొంపల్లి మున్సిపాలి టీలలో 21 పనులకు రూ.238 కోట్లను కేటాయించారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 90 శాతం, గ్రేటర్ వెలుపల మున్సిపాలిటీలలో 60 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తి స్థాయిలో కాకముందే రెండో ఫేజ్ పనులు చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్టుగా తెలుస్తున్నది.

గ్రేటర్‌లో ప్రతి ఏడాది నాలాల్లో పూడిక తొలగించడానికి కోట్ల రూపాయలను బల్దియా వెచ్చిస్తున్నది. ఈ ఏడాది గ్రేటర్ వ్యాప్తంగా నాలాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరద నీరు సవ్యంగా పారుదల అయ్యేందుకు పూడిక తొలగింపుకు గతేడాది (2023) 63 పనులకు రూ.53.60 కోట్లను బల్దియా ఖర్చు చేయగా, ఈ ఏడాది (2024)లో 201 పనులకు రూ. 56.38 కోట్లను ఖర్చు చేస్తుంది. గ్రేటర్‌లో మొత్తం 1302 కిలోమీటర్ల వ్యాప్తంగా నాలాలు ఉండగా, కేవలం 201 చోట్ల మాత్రమే నాలాల పూడిక పనులు చేపడుతున్నారు. 

నిధులు ఖర్చవుతున్నా ఫలితం శూన్యం

జీహెచ్‌ఎంసీ ప్రతి సంవత్సరం వేసవిలో నాలాల అభివృద్ధికి, నాలాలలో పూడిక తొలగింపు, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా మళ్లీ వర్షం వస్తే భయానకం పరిస్థితులనే నగర ప్రజలు చవిచూడాల్సి వస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా 1302 కిలోమీటర్లు నాలాలు ఉండగా, ఇప్పటి ఎస్‌ఎన్‌డిపి కింద చేపట్టింది కేవలం 55 ప్రాంతాల్లోనే. ఇంకా అనేక ప్రాంతాల్లో నాలాలు పటిష్టవంతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మూడేళ్ల క్రితం రూ. 985 కోట్లతో మొదలైన 55 పనులు ఇంకా చివరి దశకు చేరుకోగా, నగరంలోని 1302 కిలోమీటర్ల నాలా పనులు పూర్తి కావాలంటే ఇంకెనాళ్ల సమయం పడుతుందో మరీ.