25 June, 2026 | 4:14 PM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

25-06-2026 03:05 PM

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

చిట్యాల, జూన్ 25 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గురువారం పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ  సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్ ఫోర్స్” ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, యూనివర్సిటీ రిజిస్ట్రార్, నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్, నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి  తదితరులు హాజరయ్యారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు “సే నో టు డ్రగ్స్ – యెస్ టు లైఫ్” అనే నినాదంతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.