30 May, 2026 | 5:24 PM

పంట అవశేషాల దహనం నివారిద్దాం

30-05-2026 04:44 PM

– రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని గుంజలూరు గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... వరి కోత అనంతరం పొలాల్లో మిగిలే కొయ్యకాలు, గడ్డి తదితర పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణం, నేల సారం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని వివరించారు.

పంట అవశేషాలను కాల్చడం ద్వారా పొలాలను త్వరగా శుభ్రం చేయవచ్చని రైతులు భావించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది వ్యవసాయానికి నష్టదాయకమని తెలిపారు. అవశేషాల దహనం సమయంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి హానికర వాయువులు వాతావరణ కాలుష్యాన్ని పెంచి, వాతావరణ మార్పులకు దోహదపడతాయని చెప్పారు. అలాగే నేలలో ఉండే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి కీలక పోషకాలు దహనంతో నశించి నేల సారం తగ్గిపోతుందని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో రసాయన ఎరువుల వినియోగం పెరిగి సాగు ఖర్చులు అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు.

పంట అవశేషాల దహనం వల్ల ఉత్పన్నమయ్యే పొగ ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని పేర్కొన్నారు. రహదారులపై పొగమంచు వంటి పరిస్థితులు ఏర్పడి ప్రమాదాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా వాటిని నేలలో కలపడం, కంపోస్ట్ తయారీ, పశువుల మేతగా వినియోగించడం, మల్చింగ్ చేయడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. దీంతో నేల సారం పెరగడంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.