12 May, 2026 | 6:56 PM

బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

12-05-2026 05:49 PM

మైనర్ బాలిక ఘటనపై ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య డిమాండ్

ఇల్లందు,(విజయక్రాంతి): కేంద్ర డిప్యూటీ హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథపై నమోదైన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో వెంటనే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని, బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య డిమాండ్ చేశారు. మంగళవారం దేవులపల్లి యాకయ్యనగర్‌లో పల్లి సుజాత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు.

ప్రధాని మోడీ “బేటీ పడావో, బేటీ బచావో” అంటూ ప్రచారం చేస్తుంటే కేంద్ర మంత్రి కుమారుడిపై ఆరోపణలు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులపైనే కేసులు నమోదు చేయడం అమానుష చర్య అని విమర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మండల కమిటీ సభ్యులు సంతోష, కోటమ్మ, పద్మ, స్వరూప, హేమలి, రెహానా, హబీబున్నీసా, అమ్మి తదితరులు పాల్గొన్నారు.