04-02-2026 12:09:35 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఈ ఏడాది చివరి నాటికి ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 202 ఎకరాల విస్తీర్ణంలో, 750 పడకల సామర్థ్యంతో, అన్ని రకాల ఆధునిక వసతులతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మొత్తం రూ. 1,110 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ బీబీనగర్ పనుల పురోగతిపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తూ, అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిమ్స్‌లు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్ర మే బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
మెడికల్ విద్యా ర్థుల కోసం 24 అంతస్తులతో హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్‌లో వెయ్యికి పైగా సిబ్బంది నియామకం జరిగిందని, ఈ సంవత్సరం జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రస్తుతం 220 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
అందుబాటులో రీసెర్చ్ కార్యకలాపాలు
ఎయిమ్స్‌లో వైద్య పరిశోధన (రిసెర్చ్) కార్యకలాపాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో మొత్తం 880 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారని, అందులో 497 మంది ఎంబీబీఎస్, 146 మంది స్పెషలిస్ట్ కోర్సులు, 142 మంది నర్సింగ్ కోర్సులు చదువుతున్నారని వివరించారు. రోగులతో పాటు వారి సహాయకుల కోసం “అమృత్ నివాసం” పేరుతో ప్రత్యేక నివాస వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఎయిమ్స్‌లో నిత్యం సుమారు 1,800 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ వైద్య సేవలు నిలిచిపోకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు కొనసాగుతున్నాయని, విద్యార్థులు యూజీ, పీజీ హాస్టల్స్‌లో నివసిస్తూ వైద్య విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఎయిమ్స్ సమీపంలో రైల్వేస్టేషన్...
ఇప్పటివరకు ఎయిమ్స్ నిర్మాణంపై రూ. 831 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, మొత్తం పనుల్లో 86 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ఆయుష్మాన్ భవ, ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని, మిగతా వారికి కూడా నామమాత్రపు ఫీజులు మాత్రమే ఉంటాయని చెప్పారు. ఎయిమ్స్ పూర్తయితే తెలంగాణ రాష్ర్టంలోని గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఎయిమ్స్ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రూ. 450 కోట్లతో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్ట్ రాబోతోందని, అది పూర్తయితే ఎయిమ్స్ సమీపంలో స్టాప్ కూడా ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. ఎయిమ్స్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఈమేరకు తెలిపారు.