ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించిన ఎయిమ్స్ బృందం
ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని హైదరాబాద్ ఎయిమ్స్ బృందం మంగళవారం సందర్శించారు. ఎయిమ్స్ సీనియర్ వైద్యుల ప్రతినిధి బృందం యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్ శ్రీనివాసు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవల మెరుగుదలకు యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా చేసుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించాలని ఎయిమ్స్ ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనల్లో మెడికల్ సైన్సెస్లో సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించడం కూడా ముఖ్యాంశంగా ఉందన్నారు. త్వరలోనే ఎయిమ్స్, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్య పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం (ఎం ఓ యు) కుదుర్చుకుంటామని చెప్పారు.






