డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపండి
- అక్రమ ఆయుధాల సరఫరా జరగనీయొద్దు
- అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
- మిజోరాంలోని సియాహ జిల్లాలో..
- కేంద్ర ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుంచి మిజోరాం రాష్ట్రంలోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాల సరఫరా జరగకుండా ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మిజోరాం పోలీసులతోపాటు అసోం రైఫిల్స్ విభాగం అధికారులకు సూచించారు. మిజోరాం పర్యటనలో భాగంగా కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమార్ రెండోరోజు రాష్ట్రంలోని సియాహ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రాధాన్య కార్యక్రమాల పురో గతిపై ఆ జిల్లా అధికారులతో రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించి నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు, రైల్, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో పురోగతిపై ఆరా తీశారు. కేంద్ర ప్రాధాన్యమిస్తున్న ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సియాహా జిల్లా అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని పేర్కొన్న కేంద్ర మంత్రి... శాఖల వారీగా అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి పంపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు సూచించారు.మరోవైపు ఐజ్వాల్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మిజోరాం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా మిజోరాంలో బీజేపీ పరిస్థితి, పార్టీ బలోపేతంపై ఆయా నేతలతో బండి సంజయ్ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలకు కనీవినీ ఎరగని రీతిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నందున శాఖల వారీగా ఎన్ని నిధులను ఖర్చు చేస్తోంది? ఏయే గ్రామాలకు ఎంత వెచ్చిస్తోంది? అనే వివరాలను సేకరించి మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయా నేతలకు కేంద్ర మంత్రి సూచించారు.
అలాగే ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వం మిజోరాం అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను, నిధుల కేటాయింపు వివరాలతో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలని, ప్రతి కూడలిలో హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లాల్డుహావ్మా పచువ్, లాల్‌ఫాక్‌జువాలా హౌజెల్, కోశాధికారి సందీప్ అగర్వాల్, కార్యదర్శులు లాల్సాంగ్జువాలి జెన్, వివిధ మోర్చాల రాష్ట్ర నేతలు, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.






