అద్భుత ఆదర్శ వనిత హెలెన్ కెల్లర్
ఆత్మ విశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర అన్నట్లుగా, దృఢ సంకల్పం, కృషి, పట్టుదల, సడలని ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచిన మహిళ హెలెన్ కెల్లర్. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. వికలాంగుల ప్రపంచంలో శక్తివంతమైన వెలుగుగా ప్రవేశించి ఆత్మబంధువుగా వారిలో ధైర్యాన్ని నింపి,మనోనిబ్బరాన్ని పెంచి, ప్రపంచం ముందు వారిని తలెత్తుకొని నిలిచేలా చేసిన మహనీయురాలు హెలెన్. జీవితానికి ఒక ఆశయాన్ని కలిగించి, దాన్ని పెంపొందించిన ఆమె అంధులు, బధిరులు, మూగవారికి మార్గదర్శిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచస్థాయిలో పేరొంది, ఎందరెందరికో స్ఫూర్తినిచ్చిన మహిళామణి.
చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలై హెలెన్ ఈ ప్రపంచాన్ని చూడలేదు, ఏ శబ్దాన్ని వినలేదు. అయినా అన్ని అవయవాలు బాగున్న వారందరికంటే మహోన్నత స్థాయిలో జీవించి, పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించారు. వికలాంగుల కష్టసుఖాల మీదేకాక మహిళల హక్కులను గురించీ ఎన్నో రచనలు చేశారు. వాటి సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపారు. ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పేరున గ్రంథ రచనతో పుస్తక రచనలకు శ్రీకారం చుట్టారు. అవిటితనానికి అంధత్వానికీ మూలం పేదరికమని, అది లేని సమాజ స్థాపనతోనే వికలాంగుల సమస్యల పరిష్కారాలు సాధ్యమని, సమ సమాజం ద్వారానే దానిని సాధించగలమనీ దృఢంగా విశ్వసించారు.
కష్టనష్టాలను అధిగమించి..
వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకు విశేష కృషి చేసిన ధీరవనిత, ఉద్యమకర్త, ఉపన్యాసకురాలు హెలెన్ కెల్లర్ 1880 జూన్ 27న అమెరికా, అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా అనే ప్రాంతంలో జన్మించింది. ఏడాదిన్నర గడిచిన తర్వాత పెద్ద జబ్బు చేయడంతో ఆమె మెదడు తీవ్ర రుగ్మతకు గురైంది. క్రమంగా చూపు, వినికిడి తర్వాత మాట్లాడే శక్తినీ కోల్పోయింది. మూడేళ్ళ వయసులో ఒక రోజు పొయ్యి దగ్గర బట్టలు అంటుకొని కనుబొమ్మలు, జుట్టు, నుదురు కాలాయి. హెలెన్ నాన్న బాల్టమోర్ పట్టణంలో ప్రఖ్యాత నేత్ర వైద్యుని సలహాపై అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు ఆమెను తీసుకెళ్లారు. ఆయన సలహామేరకు, అంధులకు విద్య నేర్పే పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం వారు కెల్లర్‌కు విద్యాబుద్ధులు నేర్పించడానికి అన్నె మాన్స్ ఫీల్ సలీవాన్‌ను నియమించారు.
‘దృష్టి లేని జీవితం వృధా’ అని భావించే వారికి కాంతికిరణంగా హెలెన్ ముందు కెళ్లింది. అచంచలమైన ఆత్మనిబ్బరంతో, అత్యద్భుత ధారణాశక్తితో టీచర్ బోధనలను బాగా ఆకళింపు చేసుకొని సాధన చేసింది. బ్రెయిలీ లిపితో వినికిడి, మాటకూడా లేని కెల్లర్ ఈ పద్ధతిలో రాయటమే గాక, నేర్చుకోవడానికి ఎంతో కష్టపడింది. అనతి కాలంలోనే బ్రెయిలీ లిపిలో అనాటికి ఉన్న పుస్తకాలన్నీ చదువగలిగింది. 1900లో కాలేజీ నుండి బి.ఎ పట్టా పొందింది.
స్వశక్తితోనే పైకి రావాలి
జ్ఞాన సముపార్జన కోసం అనేక గ్రంథాలను చదువుతూ, ఇతర భాషల గ్రంథాలను అనువదిస్తూ స్వంత రచనలు ప్రారంభించింది. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలూ నేర్చుకొంది. 1914 నుంచి ప్రపంచ దేశాలు పర్యటిస్తూ, 1968 నాటికి మొత్తం 39 దేశాలను సందర్శించింది. 1955లో భారతదేశ పర్యటన చేసి ఎందరో అభాగ్యులకు మనోధైర్యం కల్గించింది. జీవితాన్ని అంధుల సేవకు అంకితం చేసి ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్’ సంస్థను స్థాపించారు. వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించటం కాదు, వారికి మనోధైర్యాన్ని ఇవ్వడమే కర్తవ్యం అని, వారి స్వశక్తితో వారు నిలబడే అవకాశాల ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం, మనోనిబ్బరం కల్పించడమే ఈ సమస్యకు సముచిత పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించి ఆ వైపు తన ప్రయత్నాన్ని కొనసాగించింది.
1902లో ప్రారంభించిన రచనా వ్యాసంగాన్ని జీవి త పర్యంతం కొనసాగించారు. ‘ద స్టోరీ ఆఫ్ ద డార్క్‌నెస్’ అనంతరం ‘మై రెలిజియన్’, ‘ద వరల్డ్ ఐ లివ్ ఇన్’, ‘అవుట్ ఆఫ్ ద డార్క్‌నెస్’, ‘ద ఓపెన్ డోర్’, ‘లెట్ అజ్ హావ్ ఫెయిత్’, ‘ద సాంగ్ ఆఫ్ ద స్టోన్‌వాల్ ’ వంటి అద్భుత పుస్తకాలను వెలువరించింది. అమెరికా దేశపు అత్యున్నత అవార్డ్ ‘ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’, పిలిప్పీన్స్ దేశపు ‘గోల్డెన్ హార్ట్’ అవార్డు, లెబనాన్ దేశపు ‘ఆర్డర్ ఆఫ్ క్రాస్’ అవార్డు, జపాన్ ప్రభుత్వం వారి ‘సీక్రెట్ ట్రిషర్ అవార్డు’, బ్రెజిల్ దేశపు ‘ఆర్డర్ ఆఫ్ క్రాస్’ అవార్డు, ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలకు చెందిన పలు డాక్టరేట్లు ఎన్నో పొంది తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అనేక సేవా కార్య క్రమాలను చేపట్టిన కెల్లర్ 1968 జూన్ 1న మరణించారు. ‘అకుంఠిత దీక్ష, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ముందు అన్ని అవయవాలు తలవంచవలసిందే’ అని నిరూపించిన హెలెన్ యావత్ మానవాళికే ఆదర్శం.
(జూన్ 1 ‘హెలెన్ కెల్లర్’ వర్థంతి)
-గడప రఘుపతిరావు
9963499282






