12-08-2025 06:54:36 PM
వనపర్తి టౌన్: దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్(AISF) కే సొంతమని ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇంచార్జ్ నరేష్(AISF District Incharge Naresh) అన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అరుణ పతాకాన్ని రమేష్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రమేష్, మాజీ విద్యార్థినేత గోపాలకృష్ణ మాట్లాడారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లక్నో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది అన్నారు. నేటికీ 90 వసంతాలు గడిచిందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం దేశ స్వాతంత్రం కోసం ఏఐఎస్ఎఫ్ ఆనాడు పోరాడిందన్నారు.
స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర, 90 వసంతాల సుదీర్ఘ ప్రయాణం దేశంలో మరే విద్యార్థి సంఘానికి లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏఐఎస్ఎఫ్ ఉద్యమించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 8వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లను పెంచాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, తాలూకా కార్యదర్శి వంశీ, తదితరులు పాల్గొన్నారు.