14 July, 2026 | 4:53 AM

సమస్యలు పరిష్కరించకుంటే సమరమే

14-07-2026 01:43 AM

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం.. 

ముగిసిన అంగన్వాడీల పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం, జులై 13 (విజయక్రాంతి): అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సమరం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండవ సోమవారం రోజు పాల్వంచ పరిధిలోని పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణ నుండి ప్రారంభమైంది.

ఈ పాదయాత్రను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీగా పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.  అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని వందలాది మందితో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని  డిడబ్ల్యుఓ స్వర్ణలత లేనిన కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూసఫ్ ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలు కట్టు బానిసలు కాదని, చాలీచాలని వేతనాలు ఇస్తూ అధిక పని భారంతో వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ప్రభుత్వ వైఖరిని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. 

ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార పంపిణీ, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీల శ్రమను గుర్తించకుండా వారిపై సంబంధం లేని అదనపు విధులను మోపడం దారుణమన్నారు.

కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా పనిభారం పెంచడం శ్రమదోపిడీయేనని ధ్వజమెత్తారు.అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రూ.18 వేల గౌరవ వేతన హామీని అమలు చేయడంతో పాటు పని భారాన్ని తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు  నరసింహారావు, నరాటి ప్రసాద్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్  డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతా మహాలక్ష్మి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాయి ఈశ్వరి కరుణకుమారి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి అరుణ గోనె మణి తదితరులు పాల్గొన్నారు.