అక్షర యోధుడు దాశరథి
అధ్యయన పోరాటాని సాక్షి.. తెలంగాణ సాయుధ సమర యోధుడు.. అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. దాశరథి స్వాతంత్య్ర సమరయోధునిగా, అక్షర బ్రహ్మగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 1928 ఆగస్టు 24న జన్మించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు ఆయనకు అన్న. తెలంగాణ వేదన, వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్యంలో పలవరించారు. ఆంధ్ర మహాసభ, ఆర్యసమాజ ప్రేరణతో నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. పగలు పిల్లలకు పాఠాలు చెబుతూ రాత్రిళ్ళు రైతు కూలీలకు ఉద్యమ బోధ చేసేవారు. ఇంతలో కృష్ణమాచార్య జైలుకెళ్లడంతో ఇంటి బాధ్యతలన్నీ రంగాచార్య మోశారు.
కుటుంబం ఉద్యమంలోకి వెళ్ళడాన్ని తండ్రి వెంకటాచార్యులు తట్టుకోలేక వారిని వదిలేసి వెళ్ళిపోయారు. బతుకుదెరువు కోసం తల్లి వెంకటమ్మ హరికథలు చెబితే, రంగాచార్యులు లైబ్రేరియన్‌గా పనిచేశారు. ఉద్యమం చివరిదశలో దాశరథి కుటుంబంపై రజాకార్లు దాడులు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళి తుపాకీ శిక్షణ తీసుకుని రజాకార్లను రంగాచార్య ఎదుర్కొన్నారు. 1948 సెప్టెంబరు 16న పోలీస్ యాక్షన్ తరువాత రంగాచార్య ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. ప్రజలను పీడించిన దొరలే రాజకీయ నాయకులుగా మారడంతో అందులో ఇమడలేకపోయిన రంగాచార్య స్వయంకృషితో 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. 1957లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చేరి 1988లో అసిస్టెంట్ కమిషనర్‌గా రిటైరయ్యారు.
మారేడ్‌పల్లి మున్సిపల్ ప్లే గ్రౌండ్ పక్కన 3 గదుల ఇల్లు ఆయన గడిపిన సాధారణ జీవితానికి అద్దం పడుతుంది. నేను కత్తి, డాలూ పట్టుకోలేను. సాయుధుడనై ఎదిరించలేను. నా పెన్నే నా గన్ను అని చాటిన ఘనపాటి రంగాచార్యులు. దాశరథి రంగాచార్య సాహితీ సేవ విలక్షణమైనది, విస్తృతమైనది, విభిన్నమైనది. రంగాచార్య రచనలు భావోద్వేగాలు కలిగిస్తాయి. వట్టికోట ఆళ్వారుస్వామి వదిలి వెళ్ళిన రచనా ఉద్యమాన్ని రంగాచార్య తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు.
వీటిలో పీరియాడిక్ నవలలైన చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం ఎంతో ప్రాచుర్యం పొందాయి. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను ఈ నవలలో కళ్ళకు కట్టించారు. ఈ నవల 1974లో సినిమాగా వచ్చింది. ఈ నవల చదివిన చండ్ర రాజేశ్వరరావు రంగాచార్యను ఆంధ్ర గోర్కీగా అభివర్ణించారు. రంగాచార్య తన ఆత్మకథను జీవనయానం పేరుతో రాశారు. ఇందులో 70 ఏళ్ల తెలుగు జాతి జీవనాన్ని చిత్రించారు. బుద్ధుని జీవిత చరిత్రను బుద్ధ భానుడు పేరుతో 2010లో వెలువరించారు. ఆయన రాసిన కథాసంపుటి నల్లవాగు. తొలుత కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితుడైన రంగాచార్య తదనంతరకాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి అభినవ వ్యాసునిగా ఖ్యాతిగాంచారు. వీరు 2015 జూన్ 8 వ తేదీన మరణించారు. వీరు జన్మించిన మానుకోట జిల్లాకి దాశరథి జిల్లాగా పేరు పెట్టాలి.
కామిడి సతీశ్‌రెడ్డి
(జూన్ 8న దాశరథి రంగాచార్యుల
వర్ధంతి సందర్భంగా)






