మోదీ 3.0కు వాళ్లే స్పీడ్ బ్రేకర్లు!
సంకీర్ణ ప్రభుత్వంలో దూకుడు నిర్ణయాలు సాధ్యమేనా?
యూసీసీ, జమిలి ఎన్నికలను బీజేపీ అమలు చేస్తుందా?
అందుకు టీడీపీ, జేడీయూ సహకరిస్తాయా?
న్యూఢిల్లీ, జూన్ 7: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బీజేపీ అనుకున్నట్లు కావాల్సిన మెజారిటీ రాకపోయినా మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపడుతోంది. ఈ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో బీహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో జేడీయూ, చంద్రబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వచ్చే
ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండాలంటే వీరిద్దరి సహకారం కీలకం కానుంది. అయితే, బీజేపీ తన ఎన్నికల అజెండాలో చెప్పిన అమలు పరిచేందుకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాషాయ పార్టీ ఎప్పటినుంచో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ), జమిలీ ఎన్నికలు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మథుర, కాశీ ఆలయాలు వారి లక్ష్యాల్లో కీలకమైనవి. మరోవైపు అగ్నిపథ్ పథకం రద్దు, కులగణన చేపట్టాలని ఒత్తిడి పెరిగిపోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారనుందని భావిస్తున్నారు.
మత ప్రభావం లేనట్లేనా..!
గత పదేళ్లుగా బీజేపీ హిందూత్వ రాజకీయాలపైనే ఆధారపడి విజయం సాధిస్తూ వచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మాస్టర్ స్ట్రోక్‌గా భావించి ఎన్నికలకు సిద్ధమైంది. అనూహ్యంగా ఎన్నికల్లో రామమందిర ప్రభావం కనిపించకపోగా కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఘోర ఓటమి చవిచూసింది. అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో మతం కంటే సామాన్య సమస్యలపైనే ఓటర్లు ఎక్కువగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో మత రాజకీయాలకు బదులుగా రాజకీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై పార్టీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
విధానాలు మార్చుకోవాల్సిందే..
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. సంకీర్ణ పక్షాల డిమాండ్లను అంగీకరిస్తూనే బీజేపీ తన ప్రాథమిక లక్ష్యాలను పునఃసమీక్షించుకోవాల్సి వస్తుంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కారణంగా పదేళ్లుగా మోదీ కేంద్రీకృత విధానాలను పాటించారు. ఇప్పుడు మోదీ వ్యక్తిగత శైలిని మార్చుకోవాల్సి రావచ్చు. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ పారిశ్రామికవేత్తలు రాజకీయ స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల చేసిన బీజేపీ మ్యానిఫెస్టోలో ఎన్నార్సీపై స్పందించకపోయినా జమిలి ఎన్నికలు, యూసీసీపై స్పష్టంగా పేర్కొంది. ఎన్నికల ఖర్చు, పాలసీల కొనసాగింపు, రాజకీయ స్థిరత్వం జమిలీతోనే సాధ్యమని నితీశ్ మద్దతిచ్చారు. కానీ, ఈ అంశంలో టీడీపీ తన స్పష్టమైన వైఖరేంటో తెలియజేయలేదు.
యూసీసీ, సీఏఏపై చర్చ
జమిలి ఎన్నికలు, యూసీసీ ప్రతిపాదనలకు జేడీయూ మద్దతు తెలపడం బీజేపీకి బూస్ట్‌ను ఇచ్చింది. ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేముందు అన్ని భాగస్వామ్య పక్షాలను భాగం చేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది. యూసీసీ అనేది బీజేపీకి భావోద్వేగ సమస్యగా చెప్పవచ్చు. ముస్లిం ఓటర్లను కోల్పోయేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. టీడీపీకి కూడా యూసీసీకి మద్దతివ్వడం ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. అయితే, బీజేపీ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని 2023లో చంద్రబాబు మాటివ్వడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. 2019లో ఇచ్చిన హామీల్లో సీఏఏ అమలు ఒకటి. ఈ ఏడాది ఎన్నికలకు రెండు నెలల ముందు మార్చి 11న చట్టం విధావిధానాలను మోదీ ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే, ఈ చట్టాన్ని మొదటి నుంచి విపక్షాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. జేడీయూ సైతం దీనిపై విమర్శలు చేసింది. 2024 జనవరిలో ఎన్డీయేలో తిరిగి చేరిన తర్వాత కూడా నితీశ్‌కుమార్ బీహార్‌లో సీఏఏ అమలును స్పష్టంగా వ్యతిరేకించారు. చంద్రబాబు మాత్రం ఈ కొత్త చట్టానికి మద్దతు ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో సీఏఏ అంశం ఆసక్తికరంగా మారనుంది.
కులగణన, అగ్నిపథ్..
బీహార్‌లో ఇప్పటికే జేడీయూ కులగణన నిర్వహించింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకు విరుద్ధంగా నైపుణ్య గణన చేపట్టి రాయితీలకు బదులుగా సంపద సృష్టి చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ విషయంలో రెండు మిత్ర పక్షాలను బీజేపీ సున్నితంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బీహార్‌లోని మరో మిత్రపక్షం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అగ్నిపథ్‌పై పునరాలోచించాలని కోరిం ది. ఈ పథకం యువతపై అధిక ప్రభా వం చూపిందని, తద్వారా వారి ఓట్లు తక్కువగా పడ్డాయని అభిప్రాయపడిం ది. ఇలాంటి పరిస్థితుల్లో సంకీర్ణ ధర్మం మోదీ 3.0 ప్రభుత్వానికి స్పీడ్ బ్రేకర్‌లాగా పనిచేస్తుందని విశ్లేషకుల భావన.






