21 July, 2026 | 11:21 AM

రీ-నీట్‌పై సందేహాలు

21-07-2026 12:00 AM

దేశంలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై మరోసారి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గతంలో చోటుచేసుకు న్న ప్రశ్నాపత్రం లీక్‌పై ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే, రీ-నీట్ నిర్వహణ, ఫలితాల్లో పారదర్శకత లోపించిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాము మొదట ఫలితాలు చూసినప్పుడు వచ్చిన మార్కులకు, ఆ తర్వాత తుది ఫలితాలకు అసలు పొంతన లేదని, గణనీయంగా మార్కులు తగ్గిపోయాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓఎంఆర్ షీట్లను, మొదట చూపిన ఫలితాలను నివేదించాలని ఎన్టీయే సూచించింది. దీంతో ఈ పరీక్షా విధానంపై మరోసారి అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమానాలు, ఆరోపణలు తలెత్తకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహించడంలో ఎన్టీయే మరోసారి విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినవిస్తున్నాయి. తాజా ఆరోపణలు, విద్యార్థుల అనుమానాలు నిజమా, కాదా అన్నది తేలాల్సి ఉంది.

అదే సమయంలో మరో అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నది. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రశ్నపత్రాల వరుస లీకులు, నియామకాల్లో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనే ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా మళ్లీ దొర్లిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమా అనే సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.

కాగా, కాగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసే పరీక్షలో ఒకసారి ప్రశ్నపత్రం లీక్, మరోసారి ఫలితాలపై సందేహాలు తలెత్తడం సాధారణ విషయమేమీ కాదు. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత కోల్పోతే దాని ప్రభావం మొత్తం విద్యా వ్యవస్థపై పడుతుంది. విద్యార్థులు తమ కష్టాన్ని కాకుండా అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల ఈ ఆరోపణలను విస్మరించడం సబబు కాదు.

వీటిపై వెంటనే స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలి. మార్కుల లెక్కింపు ప్రక్రియను బహిర్గతం చేయాలి. ప్రతి అభ్యర్థికి తన సమాధాన పత్రం, మూల్యాంకన విధానం తదితర వివరాలను అందుబాటులో ఉంచాలి. మరోసారి తప్పు జరిగి ఉంటే విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి. పారదర్శకత, జవాబుదారీతనం మాత్రమే విద్యావ్యవస్థ, పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పెంచుతాయని చెప్పక తప్పదు.