14-01-2026 12:00:55 AM
ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 13 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి అలీంకో సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. మహబూబ్నగర్ నగరం, మెట్టుగడ్డ ప్రాంతంలో స్టేట్ హోం సమీపంలో అలీంకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార శిబిరానికి గౌరవ మహబూబ్నగర్ ఎంపి డికె అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే దివ్యాంగులకు అవసరమైన ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అలీంకో సంస్థ నిర్వహిస్తున్న ఈ తరహా శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమలలో జరిగే ప్రమాదాలు, అనుకోని సంఘటనల కారణంగా అవయవాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, సహాయక ఉపకరణాలు సమయానికి అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలోనే అలీంకో సంస్థ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల దివ్యాంగులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ స్థాయిలోనూ, వ్యక్తిగతంగానూ తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఏ అవసరం వచ్చినా దివ్యాంగులు తన క్యాంపు కార్యాలయాన్ని నిర్భయంగా సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివ్యాంగులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జారినా బేగం, అలీంకో డీజీఎం సంజీవ్ సింగ్, నాయకులు తిరుమల వెంకటేష్, వర్థ రవి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.