19-11-2025 12:00:00 AM
ఆదిలాబాద్, బైంసా నవంబర్ 18 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎన్నికల పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై ఎందుకు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం ఎన్నికలు అంటూ ఢిల్లీ చెక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే నేడు రైతులు పంటను అ మ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నిర్మల్ జిల్లా బైంసా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. పత్తి రైతుల సమస్యను తెలుసుకునేందుకు తాను జిల్లాల పర్యటనకు వస్తున్నానం టేనే చాలు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందని, సిగ్గు, బుద్ధి వచ్చిందని, ఇది సంతోషకర మైన విషయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పోరాటంతోనే ప్రభుత్వం వేలిముద్ర నిబంధనను తొలగించడంతో పాటు సోయా పంట ఎకరానికి ఏడు క్వింటాళ్ల నుంచి పది క్వింటాళ్లకు పెంచిందని, అది 13 క్వింటాళ్లు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి రైతులు పండించిన పత్తి మొక్కజొన్న సోయా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పండిన పంట నాసిరకం అంటూ అధికారులు కొనుగోలు చేపట్టకుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ముదురు ప్రాంతంలో కొనుగోలు చేసిన సోయను అధికారులు వాపస్ పంపడంపై మండిపడ్డారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపడుతున్న ప్రభుత్వం ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడంపై మండిపడ్డారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పత్తి రైతుల పట్ల వివక్ష చూపుతుందని ధ్వజమెత్తారు.
ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏమిటి?
చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా పత్తి, సోయా రైతుల పరిస్థితి మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ కపాస్ యాప్ అదో దిక్కుమాలిన యాప్ పని, మొబైల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారు, మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. కపాస్ యాప్ తీసుకొచ్చి రైతులను గందరగోళం చేస్తుందని ఆంక్షలు ఎత్తివేసి రైతులు పండించిన పంటను మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు.
రైతులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది లేదన్నారు. రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఒక్కటే మార్గం అని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ సంసిద్ధంగా ఉన్నదన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హడావు దీపక్ కుటుంబానికి, అగ్ని ప్రమాదంలో పత్తి పంట నష్టపోయిన రైతులకు పార్టీ తరఫున కొంత ఆర్థికసాయం చేస్తాం అని భరోసా ఇచ్చారు.
రైతు సమస్యలపై ఈనెల 21న జరిగే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రు జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, బాల్క సుమన్, దివాకర్ రావ్, దుర్గం చిన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ నాయకులు రమాదేవి గాద విలాస్ జాన్సన్ నాయక్ కిరణ్ కొమురె వార్ రామ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు.