19-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): జల సంరక్షణలో తెలంగాణ రాష్ర్టం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు--2024లో తెలంగాణ అవార్డుల పంట పండించింది. ముఖ్యంగా ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ జల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యం విభాగంలో దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన పలువురు కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
అగ్రస్థానంలో తెలంగాణ జిల్లాలు
క్షేత్రస్థాయిలో జల సంరక్షణ చర్యలను రూఫ్‌టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటల పునరుద్ధరణ ప్రోత్సహించే లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల విభాగంలో కేటగిరీ--1 కింద దక్షిణ జోన్‌లో ఎంపికైన మూడు జిల్లాల అవార్డులనూ తెలంగాణ రాష్ర్టమే కైవసం చేసుకుంది.
ఆదిలాబాద్, నల్లగొండ, మంచిర్యాల జిల్లాలు ఈ ఘనత సాధించాయి. ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతిని గెలుచుకున్నాయి. కేటగిరీ--2లో వరంగల్, నిర్మల్, జనగామ జి ల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానా ల్లో నిలిచి, తలా రూ.కోటి బహుమతిని సొం తం చేసుకున్నాయి. కేటగిరీ--3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలు 1, 3 ర్యాంకుల్లో నిలిచి, రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతిని గెలుచుకున్నాయి.
జలమండలికి జాతీయ పురస్కారం
హైదరాబాద్‌లో జల సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లు అండ్ సీవరేజ్ బోర్డు జలమండలి, మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. ఈ పురస్కారంతో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అం దుకుంది. అవార్డు స్వీకరించిన అనంతరం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అవార్డు రావడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహం, బోర్డు ఉద్యోగులు, సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమైంది’ అని అన్నారు.
ఏడాది క్రితం ప్రారంభించిన ‘ప్రతి ఇంటా ఇంకుడు గుంత’ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వారిలో పీఆర్, ఆర్డీ కమిషనర్ డాక్టర్ శ్రీజన, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ పాటిల్, మహబూబ్‌నగర్ కలెక్టర్ బి విజయేందిర, నల్లగొండ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఉన్నారు.