12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

వర్సిటీలకే మళ్లీ సర్వాధికారాలు!

29-08-2024 01:40 AM
  1. పాతపద్ధతిలోనే నియామకాల భర్తీ 
  2. అటువైపే రాష్ట్ర సర్కారు మొగ్గు
  3. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇక లేనట్టే

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ‘పది పదిహేను రోజుల్లో యూనివ ర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయబోతున్నాం’.. ఈ నెల 26న సచివాలయంలో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. దీంతో యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, ఖాళీలను ఎలా భర్తీ చేస్తారనే చర్చ విద్యావర్గాల్లో జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట తీసుకొచ్చిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారా? లేకుంటే పాత పద్ధతిలోనే నియామకాలు చేపడతారా? అనే చర్చ వర్సిటీ వర్గాల్లో జరుగుతోంది. అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను కామన్ రిక్రూట్‌మెం ట్ బోర్డును ఏర్పాటు చేసి, దాని ద్వారా నియామకాలు చేపట్టాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. అయితే ఆ బోర్డుకు ఇంతవరకూ ఆమోదం లభించకపోవడంతో అది ఇక అటకెక్కినట్టేనని ఉన్నత విద్యామండలి అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

బోర్డు కింద 15 వర్సిటీలు

రాష్ట్రంలోని జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు తెలుగు, జేఎన్‌ఏఎఫ్‌యూ, ఆర్జీయూకేటీ, అగ్రికల్చర్, హర్టిక ల్చర్, మహిళా, ఫారెస్ట్ యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పా టు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో నిర్ణయించింది. దీనికనుగుణంగానే అదే ఏడాది జూన్‌లో కామన్ రిక్రూం ట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్‌గా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండే లా ఓ కమిటీని ఏర్పాటు చేసి జీవో నంబర్ 16 ను విడుదల చేసింది. 

అయితే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బోర్డు అటకెక్కినట్టేనని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీన్ని రెండేళ్ల కిందటే తీసుకొచ్చినప్పటికీ.. ఫైల్ ఇంకా రాష్ట్రపతి భవన్‌లోనే పెండింగ్‌లో ఉంది. బోర్డు ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తుండటంతో దానికి ఆమోదం లభించడం ఇక కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు.  

నాలుగు వేల ఖాళీలు!

అన్ని యూనివర్శిటీల్లో కలిపి సుమా రు 4500 వరకు టీచింగ్, నాన్‌టీచింగ్ ఖాళీలున్నాయి. అయితే కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 3500 వరకు ఖాళీ లను భర్తీ చేస్తామని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నిరుద్యోగులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో అభ్యర్థులకు పరిశోధనల్లో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి వర్సిటీల్లోని ఖాళీలు, వీసీల భర్తీపై ఇటీవల ప్రకటన చేయడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. కామ న్ బోర్డు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుండటంతో దానికి ఆమోదం లభించకపోతే యూనివర్సిటీ ల వారీగా నియామకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దల అనుమతి తీసుకొని ముందుకు పోవాలని అధికారిక వర్గాలు తెలిపాయి. 

యూనివర్సిటీలకు పూర్వ వైభవం

యూనివర్సిటీలకే మళ్లీ పూర్వ వైభ వం రానుంది. గతంలో ఏ యూనివర్సిటీల్లోని ఖాళీలను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునే అధికారం ఉండేది. అవి స్వయంప్రతిపత్తి వ్యవస్థలుగా ఉండేవి. అయితే ఒకేసారి అన్ని యూనివర్సిటీలు ఖాళీలను భర్తి చేసేవి కావు. అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ ను చేపట్టేవి. కామన్ బోర్డు ద్వారా వైద్య విశ్వవిద్యాలయాలను మినహాయించి రాష్ట్రంలోని 15 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశారు.

అప్పట్లో ఈ బోర్డును కొన్ని యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు, మేధావులు వ్యతిరేకించారు. యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనమేంటని విమర్శలొచ్చా యి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాం గ్రెస్ కూడా వ్యతిరేకించింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకే మొగ్గు చూపింది. ఈక్రమంలో బోర్డుకు ఇప్పటికీ ఆమోదం లభించకపోవడంతో పాతపద్ధతిలోనే అంటే గతంలో మాదిరిగా ఏ యూనివర్సిటీలోని ఖాళీలను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునేలా సర్వాధికారాలు మళ్లీ రానున్నట్టు తెలుస్తోంది.