విద్యా రంగం పట్ల పాలకుల మాటలన్నీ నీటి మూటలే
తేల్చిన తెలంగాణ బడ్జెట్
ప్రభుత్వ వైఖరి కి నిరసన గా 24న కలెక్టరెట్ ఎదుట ఆందోళన
పెద్ద ఎత్తున టీచర్లు పాల్గొనాలని టిపిటిఎఫ్ పిలుపు
మెదక్, మార్చి 22(విజయక్రాంతి): విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పదే పదే చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈ బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే కేటాయించి ఈ రాష్ట్ర ప్రజలను మళ్లీ ఒకసారి నిరాశ పరిచిందని, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేపడుతున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొంగోటి యాదగిరి, పి. వెంకట్రామి రెడ్డి లు పిలుపునిచ్చారు.
ఆదివారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడారు.ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా విద్యారంగానికి 20 శాతం గానీ, తెలంగాణ విద్యా కమిషన్ సూచించినట్లు 18 శాతం గాని, కనీసం కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో లో ప్రకటించినట్లుగా 15 శాతం కూడా బడ్జెట్ లో ప్రకటించక పోవడం వలన ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదని అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగ కేటాయింపులపై పున:పరిశీలన చేసి మానవ వనరుల అభివృద్ధికి కీలక పాత్ర పోషించే విద్యారంగానికి అధిక బడ్జెట్ కనీసం 15 శాతం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.బడ్జెట్ లో విద్యారంగానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 24 న జిల్లా కలెక్టరెట్ ఎదుట చేపట్టే ఆందోళన కార్యక్రమం లో ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలిరావాలని వారు పిలునిచ్చారు.




