23 March, 2026 | 1:37 AM

ఉగాది నంది పురస్కారం అందుకున్న కోలాటం మాస్టర్ తోకల రమేష్

23-03-2026 12:21 AM

అశ్వాపురం, మార్చి 22, (విజయక్రాంతి): మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ప్రముఖ కోలాట మాస్టర్, కవి, గాయకుడు,ఐటీసీ ఉద్యోగి తోకల రమేష్ కి ఉగాది సందర్భంగా ఖమ్మంలోని రాములవారి ఆలయ ప్రాంగణంలోని రామగిరి ఫంక్షన్ హాల్లో ఆదివారం వైభవంగా నిర్వహించిన స్వర్ణ నంది ఉగాది పురస్కారాల వేడుకలో ప్రతిష్టాత్మక స్వర్ణ నంది ఉగాది పురస్కారంను అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎన్. కాంతేశ్వరరావు, సినీ రచయిత కోమాకుల సీతారాములు, కవిరత్న తోటమళ్ళ సురేష్ బాబు, ఈటీవీ పాడుతా తీయగా న్యాయనిర్ణేత రాజబాబు తదితరులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కష్టాలను అధిగమిస్తూ స్వయంకృషితో ఎదిగిన రమేష్ తన రచనలు, జానపద కోలాటం ద్వారా సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఐటీసీ ఉద్యోగిగా సేవలందిస్తూనే గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ కొత్త తరాలకు పరిచయం చేస్తున్నారని వక్తలు కొనియాడారు.

అవార్డు గ్రహీత రమేష్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన గురువులు, ఐటీసీ సంస్థకు అంకితమని, గ్రామం, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో కూడా కళా, సాహిత్య, సామాజిక సేవల ద్వారా మరింత సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం అధ్యక్షుడు కురవిళ్ల ప్రవీణ్, బలగం ఫేమ్ కుర్తానందం, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పాలకుర్తి కృష్ణ, కన్వీనర్ మొగిలి గుణకర్, కో-కన్వీనర్ నాగ సాయి, డైరెక్టర్ రవి తోప్, గాయకుడు కోదాడ నరసింహారావు పాల్గొన్నారు.