18 June, 2026 | 3:13 AM

వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందించాలి

18-06-2026 02:03 AM

 ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్ జూన్ 17: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీసీహెచ్‌ఎస్ రమేష్ చంద్రతో కలిసి ఆసుపత్రిని పరిశీలించిన ఆయన, అనంతరం ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, ఎండోస్కోపీ, ఈఎన్టీ పరికరాలు, కంపౌండ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రూ.38 లక్షలు అభివృద్ధి పనులకు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.

అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించి, నిర్ణయించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సంధ్యాకిరణ్, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాములు, సర్పంచ్ సునీత తదితరులు పాల్గొన్నారు.