మధ్యాహ్నమే మాయమైతుండ్రు!
- మోతె మండలంలో గ్రామ కార్యదర్శుల పనితీరుపై ఆరోపణలు
- చుట్టపు చూపులా విధుల నిర్వహణ!
- మధ్యాహ్నం 12 దాటితే ఇంటి దారి?
- జిల్లా, మండల అధికారుల వ్యవహారంపై అనుమానాలు
- పాలనపై పట్టు తప్పిందంటూ విమర్శలు
- విధులు సక్రమంగా నిర్వహించేలా చూడాలని పలువురు వేడుకోలు
మోతె, ఏప్రిల్ 19: మండల వ్యాప్తంగా ఉన్న 29 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటల లోపు పేస్ రిజిగ్నేషన్ నమోదు కోసం వచ్చిన కార్యదర్శులు అది పూర్తి అయిన తర్వాత కేవలం రెండు గంటలు మాత్రమే గ్రామపంచాయతీలో కూర్చొని తదుపరి స్వేచ్ఛగా ఇంటిదారి పడుతున్నారని మండలంలోని పలు గ్రామాల ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
చుట్టపు చూపులా విధులకు హాజరు!
గ్రామపంచాయతీలలో విధులు నిర్వహించేందుకు కార్యదర్శులు చుట్టపు చూపు లా వస్తున్నారని పలు గ్రామాల ప్రజలు బా హటంగానే చెబుతున్నారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత పలువురు కార్యదర్శులు ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటున్నారు తప్పితే పనులు మాత్రం చేయడం లేదని స్థానికులే చెబుతుండడం గమనార్హం. పనుల నిమిత్తం గ్రామపంచాయతీకి వస్తే మండల కార్యాలయంలో పని ఉందని హడావుడి చేస్తూ చక్కగా ఇంటి దారి పట్టి వెళ్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
ఆ సమయంలో గ్రామపంచాయతీ నుండి ఏవైనా ఫోటోలు కావాలని ఉన్నతాధికారులు అడిగినప్పుడు మల్టీపర్పస్ వర్కర్లకు ఫోన్ చేసి ఫోటోలు తెప్పించుకుని వాటిని వాట్సప్ ద్వారా పంపిస్తున్నారని మల్టీపర్పస్ వర్కర్ లే చెబుతున్నారని స్థానికుల ద్వారా తెలుస్తుంది. కార్యదర్శులపై జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే వారు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతమే నయం
మండలంలో గతంలో ఐదు గ్రామపంచాయతీలకు ఒక పంచాయతీ కార్యదర్శి చొప్పున పని చేసినప్పటికీ ఆయా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యదర్శులు పనిచేసి ఆయా గ్రామాల ప్రజల మెప్పు పొందినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉన్నప్పటికీ గ్రామాల్లో సమస్యలు గాలికి వదిలేసి వారు మాత్రం ఇంటి దారి పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా పని నిమిత్తం గ్రామపంచాయతీకి వెళ్లిన ప్రజలు కార్యదర్శి కి ఫోన్ చేస్తే ఫీల్ లో ఉన్నాం, మండల ఆఫీసులో ఉన్నాం, బ్యాంకుకు వచ్చాం సమాధానాలు చెప్తూ వారు మాత్రం నిజంగా ఇండ్లలో ఉంటున్నారని స్థానికులే ఆరోపిస్తున్నారు.
అధికారుల తీరిపై అనుమానాలెన్నో...?
పంచాయతీ కార్యదర్శులపై అజమాయిషీ చేయాల్సిన మండల, జిల్లా పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వారు అడ్డూ, అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారని చర్చలు స్థానికంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. పంచా యతీ కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహించకపోయినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికంగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజులు సెలవు పెడితే ఒకరేటు, నెల రోజులైతే మరో రేటు మాట్లాడుకుని వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
సమస్యలు గాలికొదిలి
ప్రస్తుతం ఎండలు ముదిరి అనేక గ్రామాల్లో త్రాగునీటి ఎద్ధడి నెలకొంది. అంతేకాకుండా పలుచోట్ల మురుగు కాలువలు శుభ్రం చేయించక చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నాయి. అలాంటి సమస్యలు ఏమి పట్టించుకోకుండా నూతనంగా ఎన్నికైన సర్పంచులకే వాటిని వదిలేసి వారు ఇంటికి వెళ్లి సొంత పనులు చూసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి విధులకు డుమ్మా కొట్టి సొంత పనులు చేసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ వారు విధులు సక్రమంగా నిర్వహించేలా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా
గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉండాలి. ముందస్తుగా వెళ్తున్నారన్న సంగతి నా దృష్టికి రాలేదు. అలాంటివి నా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
తిప్పని ఆంజనేయులు, ఎంపీడీవో, మోతె






