18 July, 2026 | 12:42 AM

కాజీపేట బస్టాండ్‌కు స్థలాన్ని కేటాయించండి

18-07-2026 12:42 AM

రైల్వే జీఎంకు ఎంపీ కావ్య విజ్ఞప్తి 

కాజీపేట, జులై 17 (విజయక్రాంతి): కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద నూతన బస్టాండ్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని కేటాయించే విషయంలో ప్రక్రియ వేగవంతం చేయాలని రైల్వే జీఎం, డిఆర్‌ఎంకు వరంగల్ ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కేసికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్లను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం భూ మార్పిడి అంశంపై వారితో ఎంపీ విస్తృతంగా చర్చించారు. కాజీపేట సిగ్నల్ జంక్షన్ పరిధిలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమితో సమాన విలువ ప్రాతిపదికన మార్పిడి చేయాలని రైల్వే శాఖ 2025 జూన్ 4న ప్రతిపాదించినప్పటికీ, ఏడాదికిపైగా గడిచినా ప్రక్రియ ముందుకు సాగలేదని ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరించారు. భూ మార్పిడి కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతంలో అనువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.

భూ మార్పిడి ప్రక్రియను పూర్తి చేసేందుకు రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించి, అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భూ మార్పిడి ప్రక్రియలో జాప్యం కారణంగా కొత్త బస్టాండ్ నిర్మాణం ఆలస్యమవుతోందని ఎంపీ తెలిపారు. సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని త్వరితగతిన సంయుక్త స్థల పరిశీలన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.