calender_icon.png 8 June, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ మహారాణి!

08-06-2025 12:00:00 AM

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి ‘ఏఏ22ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. సన్స్ పిక్చర్స్ పతాకంపై సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ శనివారం ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె కథానాయకిగా చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘ది ఫేస్ ఆఫ్ ఏఏ22ఏ6’ పేరుతో దీపిక పడుకొణె స్పెషల్ వీడియోను సన్స్‌పిక్చర్స్ సోషల్‌మీడియాలో రిలీజ్ చేసింది. ‘విజయం దిశగా వెళ్తున్న మహారాణి. దీపికా పడుకొణెకు స్వాగతం’ అంటూ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో దీపికా పడుకొణెకు డైరెక్టర్ అట్లీ స్టోరీ, నెరేషన్ వినిపిస్తున్నట్టు చూపించారు. తర్వాత కట్ చేస్తే.. కత్తి పట్టి గుర్రంపై దీపికా పడుకొణె స్వారీ చేసే సీన్‌కు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ మేకింగ్‌ను చూపించారు. కొన్ని పెయింటింగ్స్, యోధురాలిగా, సూపర్ ఉమెన్‌గా దీపికా యాక్షన్ చేసే కొన్ని సన్నివేశాలు, ఫొటోలు చూపించారు. ఇకపోతే ఇదివరకు అట్లీ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘జవాన్’లో ఓ హీరోయిన్‌గా దీపికా పడుకొణె నటించింది.

ఇప్పుడు రెండోసారి అట్లీ డైరెక్షన్‌లో దీపికా పనిచేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ‘జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పనిచేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు.

ఇప్పుడు అల్లు అర్జున్ గారితో దీపికా పడుకొణె గారు కలిసి సినిమా చేయటమనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇందులో సృష్టించబోతున్నాం” అని పేర్కొన్నారు. సన్ పిక్చర్స్ స్పందిస్తూ ‘దీపికా పడుకొణె భాగం కావటం ద్వారా ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ఆమె స్టార్ పవర్, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్ సినిమాను రూపొందించబోతున్నాం” అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.