అల్లు అర్జున్‌కు అభిమానిని!
అల్లు అర్జున్‌పై బాలీవుడ్ బాద్ షా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ చిత్రానికి పాన్ ఇండియా లెవల్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ చిత్ర యూనిట్ ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఈవెంట్‌లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారు. అమితాబ్ ఎందరో నటులకు స్ఫూర్తి .. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు కూడా ఆయనే స్ఫూర్తి” అని తెలిపారు. అమితాబ్ బచ్చన్ తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు. మీరు నన్ను నా అర్హతకు మించి ప్రశంసించారు. వాస్తవానికి నేను నీ ప్రతిభ, పనితీరుకు అభిమానిని. నువ్వు ఇలాగే ఎందరికో స్ఫూర్తినిస్తూ ఇలాంటి ఎన్నో హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. అమితాబ్ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకున్నానని.. తనపై ఆయనకున్న ప్రేమకు ధన్యవాదాలని తెలిపారు.






