22 July, 2026 | 8:44 PM

Breaking News

ఇకపై నాకన్నీ కష్టాలే!

07-06-2024 12:55 AM

అధీర్ రంజన్ చౌదరీ 

కోల్‌కతా, జూన్ 6: ఇకపై తనకు గడ్డు కాలమే అంటూ పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న ఈ స్థానం నుంచి పాతికేళ్లుగా అధీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ చేతిలో 85 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ‘రానున్న రోజులు చాలా కఠినమైనవి. తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాను. బెంగాల్‌లో నేను టీఎంసీ ప్రభుత్వంపై పోరాడాను. నాకు రాజకీయాలు తప్ప మరో నైపుణ్యం లేదు. త్వరలో ఢిల్లీలోని ఎంపీ అధికార నివాసాన్ని ఖాళీ చేస్తాను. సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో చేరడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. బహరంపూర్‌లో నా ఓటమి అంగీకరిస్తున్నా. గతంలోనే పీసీసీ విషయంలో నా కంటే సమర్థవంతమైన నేతను ఎన్నుకోవాలని కోరాను. కానీ, సోనియా గాంధీ కోరిక మేరకు నేను ఈ పదవిలో కొనసాగాల్సి వచ్చింది. ఫలితాల అనంతరం మా నాయకుల నుంచి నాకు ఎటువంటి పిలుపు రాలేదు. నాకు అధిష్టానం నుంచి పిలుపు రాగానే నా వైఖరిని పార్టీ నేతలకు తెలియజేస్తా. రాహుల్ భారత్ జోడో యాత్ర ముర్షిదాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల్దా నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చారు. కానీ, నా సెగ్మెంట్‌లో ప్రచారానికి ఎవరూ రాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.