22 July, 2026 | 7:43 PM

మాయావతి వల్లే ఎన్డీఏకు అధికారం!

07-06-2024 01:03 AM

యూపీలో 16 స్థానాల్లో కూటమి ఓట్లను చీల్చిన బీఎస్పీ

విపక్షాలతో మాయావతి చేరితే ఫలితాలు మరోలా ఉండేవి

న్యూఢిల్లీ, జూన్ 6: లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు ఆశించిన బీజేపీ చాలా తక్కువగా 240 స్థానాలతో ముగించింది. 2019లో 303 ఫిగర్ సాధించిన కాషాయం పార్టీ ఈ సారి ఏకంగా 63 సీట్లను కోల్పోయింది. మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఈ విషయంలో మాయావతికి బీజేపీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఒకవేళ ఇండియా కూ టమిలో బీఎస్పీ భాగస్వామ్యమైతే ఎన్డీఏ పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. 

బీజేపీ కంచుకోటలా..

మోదీ వేవ్ మొదలైన 2014 నుంచి 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ వశంలోనే ఉంది. 2014, 2019లో దాదాపు 50 శాతం ఓట్లతో 62 స్థానాల్లో గెలిచింది. కానీ, ఈ సారి 41 శాతం ఓట్లతో 33 స్థానాలకు బీజేపీ పడిపోయింది. యూపీలో 79 స్థానాల్లో బీఎస్పీ పోటీచేసింది. 9.4 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటు గెలవలేదు. ఎన్డీయే గెలిచిన 16 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ఓటమిని బీఎస్పీ శాసించింది. 

మాయావతి చేయి కలిపితే..

మాయావతి ఒకవేళ విపక్షాలతో కలిస్తే బీజేపీ ఈ 16 స్థానాలు కోల్పోయే అవకాశం ఉండేది. బన్స్‌గావ్, ఫరూఖాబాద్, ఫుల్పూర్ వంటి స్థానాల్లో 5 వేల కన్నా తక్కువ ఆధిక్యమే లభించింది. ఆ స్థానాల్లో బీఎస్పీ అభ్య ర్థులు 50వేలకుపైగా ఓట్లు సాధించారు. మీ రఠ్‌లో బీజేపీ అభ్యర్థి 10 వేల ఆధిక్యం సాధించగా బీఎస్పీ అభ్యర్థికి 87 వేల ఓట్లు వచ్చాయి. బదోహిలో బీజేపీకి 44 వేల మెజారిటీ రాగా బీఎస్పీ అభ్యర్థి 1.55 లక్షల ఓట్లు సాధించారు. ఈ స్థానాల్లో బీజేపీ ఓడిపోతే 224 వద్దే ఆగిపోయేది. ఎన్డీఏ మార్క్ 277కు చేరేది. ఇది మ్యాజిక్ ఫిగర్‌కు 5 మాత్రమే ఎక్కువ కావడం గమనార్హం. 

కూటమికి అవకాశం ఉండేనా?

ఈ సమీకరణాలను లెక్కేస్తే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకూ అవకాశం ఉండేది. ఈ 16 సీట్లు కూటమికి వస్తే వారి బలం 248కు చేరుకుంటుంది. అప్పుడు టీడీపీ, నితీశ్ పార్టీలను సముదాయిస్తే ఇండియా అధికారంలోకి వచ్చేది. టీడీపీ 16, జేడీయూ 12 సీట్లను తీసేస్తే ఎన్డీఏ బలం 265కు చేరేది. ఈ నేపథ్యంలో నితీశ్, చంద్రబాబు అవసరం ఎంత ప్రాధాన్యమో మోదీకి తెలుసు. అందుకే ఫలితాల రోజు చేసిన ప్రసంగంలో వీరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.