22 July, 2026 | 9:48 PM

504 ఎంపీలు కోటీశ్వరులే

07-06-2024 12:52 AM

టాప్ 10లో ఏపీ నుంచే నలుగురు 

బీజేపీలోనే ఎక్కువ మంది ధనవంతులు

2019 కంటే పెరిగిన కోటీశ్వరుల సంఖ్య

ఏడీఆర్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 6: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో 93 శాతం కోటీశ్వరులే ఉన్నారు. మొత్తం 543 మందిలో 504 మంది సభ్యులు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. గత లోక్‌సభ సభ్యులతో పోలిస్తే క్రమంగా ధనవంతుల సంఖ్య పెరిగుతోందని తన నివేదికలో పేర్కొంది. 2019తో పోలిస్తే 88 శాతం(475 మంది)గా ఉన్న కోటీశ్వరుల సంఖ్య ఈ ఎన్నికల్లో 93 శాతానికి పెరిగిందని నివేదించింది. అదే 2014లో వీరి సంఖ్య 443 (82 శాతం), 2009లో 315 (58 శాతం)గా ఉంది. 18వ లోక్‌సభలో చూస్తే మొదటి 10 మంది కోటీశ్వరుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ఒకరు తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు ఉన్ననారు. అభ్యర్థుల వారీగా చూస్తే... 

కోటీశ్వరుల్లో బీజేపీ ఎంపీలే ఎక్కువ

లోక్‌సభ ఎంపీల్లోని కోటీశ్వరుల్లో ఎక్కువ మంది బీజేపీ నుంచే ఉన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మొత్తం 240 మంది బీజేపీ ఎంపీల సగటు ఆస్తి రూ.50 కోట్లు. బీజేపీ ఎంపీల్లో 227 (95 శాతం) మంది కోటీశ్వరులు ఉన్నారు. 99 మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తి రూ.23 కోట్లు. కాంగ్రెస్‌లో 92 మంది (93 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. 37 మంది ఎస్పీ ఎంపీల సగటు ఆస్తి రూ. 15.24 కోట్లు కాగా 29 మంది తృణమూల్ ఎంపీల సగటు ఆస్తి రూ.18 కోట్లు. టీడీపీలోని 16 మంది ఎంపీల సగటు ఆస్తి రూ.442.26 కోట్లుగా ఉంది.

చంద్రశేఖర్ పెమ్మసాని

మొదటి స్థానంలో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఉన్నారు. ఆయన టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.5,705 కోట్లు. 

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రెండో స్థానంలో తెలంగాణకు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఆయన చేవెళ్ల సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి గెలిచారు. ఆయన మొత్తం ఆస్తులు రూ.4,568 కోట్లు. 

నవీన్ జిందాల్

ప్రముఖ వ్యాపార నవీన్ జిందాల్ ఈ జాబితాలో మూడో స్థానం లో ఉన్నారు. ఈయన హర్యానాలోని కురుక్షేత్ర స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. జిందాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.1,241 కోట్లు ఉంది. 

ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన నెల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రభాకర్‌రెడ్డి మొత్తం ఆస్తులు 716 కోట్లు. 

సీఎం రమేశ్

ఐదో స్థానంలో ఉన్న సీఎం రమేశ్ కూడా ఏపీకి చెందినవారే. ఆయన బీజేపీ తరఫున అనకాపల్లి స్థానంలో గెలుపొందారు. రమేశ్ మొత్తం ఆస్తులు రూ.497 కోట్లు కాగా చరాస్తులు రూ.52 కోట్లు, స్థిరాస్తులు రూ.445 కోట్లు ఉన్నాయి.

జోత్యిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఈయన గుణ స్థానం లో బీజేపీ తరఫున గెలిచారు. సింధియా మొత్తం ఆస్తులు రూ.424 కోట్లు.

ఛత్రపతి షాహూ మహారాజ్

ఏడో స్థానంలో ఉన్న ఛత్రపతి షాహూ మహారాజ్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆయన మొత్తం ఆస్తి రూ.342 కోట్లు.

శ్రీభరత్

ఏపీ చెందిన శ్రీభరత్ విశాఖపట్నం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన మొత్తం ఆస్తులు రూ.298 కోట్లు కాగా చరాస్తి రూ.68 కోట్లు, స్థిరాస్తి రూ.230 కోట్లు ఉంది.

హేమమాలిని 

ప్రముఖ సినీ నటి హేమమాలిని తొమ్మిదో ప్లేసులో ఉన్నారు. ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్థానంలో బీజేపీ తరఫున గెలుపొందారు. ఆమె మొత్తం ఆస్తి రూ.278 కోట్లు. 

డాక్టర్ ప్రభ మల్లికార్జున్

కర్ణాటకలోని దేవనగెరె స్థానంలో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన డాక్టర్ ప్రభ పదో స్థానంలో ఉన్నారు. ఆమె మొత్తం రూ.241 కోట్లు. అందులో చరాస్తులు రూ.91.4 కోట్లు?