22 July, 2026 | 6:16 AM

అతివలకు అండగా..

30-06-2024 01:39 AM

‘మహిళా శక్తి’తో ఆర్థిక స్వావలంబన

డ్వాక్రా సంఘాల సభ్యులకు సామాజిక భద్రత

మెదక్ జిల్లాలో 4,030 మందికి ప్రయోజనం

మెదక్, జూన్ 29 (విజయక్రాంతి) : మహిళల్లోని శక్తి సామర్థ్యాలను వెలికితీసి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మహిళా శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. స్వయం సహాయక సంఘా ల్లో ఉన్న సభ్యులు ఆర్థికంగా శక్తిమంతులుగా తయారై కోటీశ్వరులు కావాలన్నదే ఈ పథ కం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది మార్చిలో మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలే దు.

కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో 13,060 సంఘాల్లో 1,35,963 మంది సభ్యులుగా ఉన్నారు. మహిళా శక్తిలో భాగంగా 2024 సంవత్సరానికి గానూ 4,030 మంది మహిళలకు రూ.24.51 కోట్లు వడ్డీలేని రుణాలను స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి ఆయా సంఘాల్లోని మహిళలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు. 

వివిధ రంగాల్లో శిక్షణ

మహిళలకు మైక్రో ఎంటర్‌ప్రైజ్ అభివృద్ధిలో భాగంగా తయారీ, ట్రేడింగ్, సేవా రంగాల్లో శిక్షణ ఇస్తారు. తయారీ రంగంలో పాడి పరిశ్రమ, మినీ డెయిరీ యూనిట్లు, కూలర్లు, పౌల్ట్రీ, ఫిషరీస్, మినీ పౌల్ట్రీ యూని ట్లు, చేనేత వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, ఆహార తయారీ, హస్తకళలు, యూనిఫాంలు కుట్టడం, సానిటరీ నాప్కిన్లు తయారు చేయడం వంటివి ఉంటాయి. ట్రేడింగ్ రంగంలో మినీ సోలార్ యూనిట్లు, మినీ సూపర్ మార్కెట్లు, జెనరిక్ మెడికల్స్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, విత్తనాలు, ఎరువులు, సేవా రంగంలో క్యాటరింగ్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ ఉపకరణాల అద్దె కేంద్రాలు, వ్యవ సాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్స్, ఐటీ సేవలు, మానవ వనరుల సరఫరా వంటి వాటికి ప్రాధాన్యతనిస్తారు. 

మహిళలకు వడ్డీలేని రుణాలు

మహిళలు బ్యాంకుల నుంచి సున్నా వడ్డీ రుణాలు పొందేందుకు వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేస్తారు. ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి వారికి ఆ రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. అన్ని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ఒకే రకమైన బ్రాండింగ్ కల్పించి నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అలాగే స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులకు వివిధ సంస్థల ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారు. అంతేగాకుండా వివిధ వాణిజ్య మేళాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉత్పత్తులను పెద్ద పరిమాణంలో కొనుగోలు చేసేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా సహకరిస్తారు.

సంఘాలు ఉత్పత్తి చేసే ఒకే రకమైన వస్తువులను జిల్లా కేంద్రాల్లో ఒక పాయింట్‌కు చేర్చి అక్కడే వాటికి ప్రాసెసింగ్ సదుపాయం కల్పించమే కాకుండా ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. సంఘాల ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ లింకేజీ ఏర్పాటు చేస్తారు. స్వయం సహాయక సంఘాలను ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్‌బీ, ఐఆర్‌ఎంఏ వంటి సంస్థలతో అనుసంధానించి, సంఘాల సూక్ష్మ వ్యాపార ప్రణాళికలను అధ్యయనం చేసి పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం బ్యాంకులకు సిఫార్సు చేసేందుకు సెర్ఫ్, మెప్మా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 

రుణ బీమా పథకం

స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకునే రుణాల కోసం ప్రభుత్వం రుణభీమా పథకాన్ని ప్రారంభించనుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే మహిళలు మరణిస్తే వారి కుటుంబాలపై భారం పడకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది. సంఘాల్లో ఉన్న 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలోపు మహిళలకు రూ.10 లక్షల జీవిత బీమా సౌకర్యం కూడా కల్పించనున్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే మహిళా సంఘాలకు అప్పగించారు. మధ్యాహ్న భోజనం పథకం కూడా మహిళలే నిర్వహిస్తున్నారు.

మహిళలు ఆర్థికంగా బలపడతారు

మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు మహిళా శక్తి పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథ కం ద్వారా సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ అవకాశాన్ని మహి ళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. 

 శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ మెదక్