పూర్వ విద్యార్థుల ‘రజతోత్సవ’ సంబురాలు
కేసముద్రం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలోని శ్రీ వివేకానంద హైస్కూల్ 1999, 2000 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ సమ్మేళనం అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించారు. పాఠశాల విద్యను పూర్తి చేసుకుని 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ ‘సిల్వర్ జూబ్లీ’ (రజతోత్సవ) వేడుకలు మధుర స్మృతుల మధ్య సాగాయి.
పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల అశోక్ రెడ్డితో పాటు ఆనాటి గురువులు సతీష్ రెడ్డి, యాకయ్య, వీరారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎడ్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ పాతికేళ్ల తర్వాత విద్యార్థులంతా ఒకే చోట చేరి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి నేడు సమాజంలో వివిధ రంగాల్లో స్థిరపడటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గురువందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితం నాటి పాఠశాల ముచ్చట్లను, చిన్ననాటి అల్లరిని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. తమ ప్రస్తుత వృత్తి, ప్రవృత్తి గురించి ఒకరితో ఒకరు పంచుకున్నారు. మిత్రుల ఆటపాటలు, విందు వినోదాలతో రోజంతా కోలాహలంగా గడిచింది. ఈ కార్యక్రమంలో 1999-2000 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా, ఈ వేడుకను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ నిర్వాహక కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆవుల యుగంధర్ యాదవ్, అల్లం నిరంజన్, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఓంజీ, దేవా శంకర్, కోరళ్ల సుభాష్, సాగరిక, వర్ష, సృజన, హేమలత,హేమలత తదితరులు పాల్గొన్నారు.




