18-08-2025 02:23:29 AM
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి)ః కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ పోషణ్ 2.0’ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించి, ప్రసవానంతర మరణాలను నివారించడమే కాకుండా, నవజాత శిశువుల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు ఈ పథకం కృషి చేస్తోందన్నారు.
కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ పథకం పురోగతిని, సాధించిన ఫలితాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా గర్భిణులు, 83 వేల మంది బాలింతలు పోషణ్ 2.0 కింద లబ్ధి పొందారని తెలిపారు. ఈ పథకం ద్వారా వంద శాతం ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడం, తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని చెప్పారు.
ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తూ, దేశాభివృద్ధిలో మహిళలకు సరైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నారీశక్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.