16 July, 2026 | 1:24 AM

ఎస్పీని కలిసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్

16-07-2026 01:23 AM

మిల్లర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతి 

ములుగు, జులై 15 (విజయ క్రాంతి) : తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం, కృషి చేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ను బుధవారం వేడుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్  ఐపిఎస్ ను రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో మిల్లర్లు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

అదేవిధంగా రైస్ మిల్లర్లు ఎస్పీకి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ 2025-2026 రబి సీజన్లో ములుగు జిల్లాలోని మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యాన్ని ఓపెన్ స్టోరీల్లో  చేయడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ చేస్తూ బలవంతంగా ధాన్యాన్ని దిగుమతి చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం బియ్యం తీసుకోకపోవడంతో ఎఫ్సీఐలో గోదాములు లేకపోవడం మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ ధాన్యంలో నాణ్యత లోపించి డిష్ కలర్ డామేజ్ అధికమైపోతూ దాన్యంలో వెయిట్ లాస్ ఏర్పడుతుందని, దీంతో తాము నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో మిల్లర్లు నష్టపోయి ప్రభుత్వానికి బాకీ పడితే అలాంటి సమయంలో తమపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. ఎస్పీ సైతం సానుకూలంగా స్పందించి మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్ పాల్గొన్నారు.