15 April, 2026 | 3:57 AM

‘సర్వజ్ఞ’లో ఘనంగా అంబేద్కర్ జయంతి

15-04-2026 01:22 AM

నివాళులర్పించిన పాఠశాల చైర్మన్ తదితరులు

ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): ఖమ్మం పట్టణం వీడిఓస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప విద్యావేత్త అని కొనియాడారు.అంబేద్కర్ కష్టపడి చదివి, విదేశాలలో చదువుకున్న తొలి భారతీయులలో ఒకరిగా నిలిచారని, అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, యూకేలోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ పట్టాలను సాధించడం ఆయన మేధస్సుకు నిదర్శనమని పేర్కొన్నారు.కుల, మత, లింగ వివక్ష లేని సమాజం కోసం ఆయన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించారని తెలిపారు.

జ్ఞానం లేనిదే విముక్తి సాధ్యం కాదని, విద్యే సమాజానికి అసలైన ఆయుధమని ఆయన నమ్మారు. మహిళల హక్కుల కోసం, అందరికీ విద్య అందాలనే లక్ష్యం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు.నేడు మన దేశంలో ప్రతి బిడ్డకు అందుతున్న ఉచిత, నిర్బంధ విద్యకు అంబేద్కర్ వేసిన పునాదులే కారణమని తెలిపారు.విద్యతో పాటు వినయం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కలిగి ఉండటమే నిజమైన విద్యార్థి లక్షణమని ఆయన జీవితం మనకు నేర్పుతుందని కొనియాడారు.కేవలం డిగ్రీల కోసమే కాకుండా, విజ్ఞానం ద్వారా అణచివేత నుంచి బయటపడాలని బోధించిన గొప్ప విద్యా తత్వవేత్త ఆయన అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొని అంబేద్కర్‌కి ఘన నివాళులు అర్పించారు.