2 July, 2026 | 9:31 PM

జీవో 317కు సవరణ!

12-06-2024 01:46 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): జీవో 317, జీవో 46 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ కానుంది. కొత్త జిల్లాలు, జోన్లకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల కేటాయింపు కోసం తీసుకొచ్చిన జీవో 317, పోలీసు నియామకాల్లో వివాదాస్పదంగా మారిన జీవో 46పై కమిటీ చర్చించనుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు సమావేశమైన ఈ కమిటీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆయా సంఘాల నేతల నుంచి వినతిపత్రాలు తీసుకుంది. వీరి సమస్యల పరిష్కారానికై వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. 

ఈ జీవోలపై ఫిర్యాదులు, సలహాలు అందజేయాలని సూచించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 కారణంగా టీచర్లు, ఉద్యోగులు దూరప్రాంతాలకు బదిలీకావడంతోపాటు, కొందరు స్థానికతను, మరికొందరు సీనియారిటీని కోల్పోయారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీఓను సవరణ చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని రేవంత్ సర్కారు నియమించింది. గతంలో కమిటీకి టీచర్లు, ఉద్యోగ సంఘాలు అందించిన వినతిపత్రాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. తాజాగా ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, విజ్ఞప్తులను ఈ సమావేశంలో పరిశీలించి వాటిపై ఓ నివేదిక రూపొందించి సీఎంకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జీవోల సవరణపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.