వర్సిటీల్లో రెండు సార్లు అడ్మిషన్లు
ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు
యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఇక నుంచి ఏడాదిలో రెండుసార్లు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు నిర్వహించేలా అనుమ తులు ఇస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీశ్‌కుమార్ పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల తరహాలోనే భారత విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండు సార్లు అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 2024 విద్యాసంవత్సరం నుంచి రెండు దశల్లో అడ్మిషన్లకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. జూలై జనవరి నెలల్లో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బోర్డు ఫలితా ల్లో జూలై అడ్మిషన్లు తీసుకోలేకపోయినా అభ్యర్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం ద్వారా విద్యార్థులకు సమయం వృథా కాదన్నారు. కంపెనీలు సైతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను రెండుసార్లు నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.






