స్నేక్ గ్యాంగ్‌కు జీవిత ఖైదు సబబే
కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): స్నేక్ గ్యాంగ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఏడుగురి ముఠాకు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. నిందితులు ఒంటరి జంటలను దోపిడీ చేయటం, పాములతో భయపెట్టి మహిళలపై లైంగిక దాడులు చేయటం వంటి నేరాలకు పాల్పడ్డారు. షహీన్ నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో మహిళను వేధించటంతో పోలీసులు అరెస్టు చేశారు. వారిపై మోపిన అభియోగాలు నిరూపణ కావటంతో రెండో ప్రత్యేక సెషన్స్ జడ్జి గతంలో నిందితులందరికీ జీవిఖైదు శిక్షలు విధించారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు చేసిన అప్పీళ్లను జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధతో కూడిన ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. స్నేక్‌గ్యాంగ్ అరాచకాలు పదేండ్ల క్రితం పాతబస్తీలో సంచలనం సృష్టించాయి. ఓ కుటుంబం ౨౦౧౪ జూలైలో తమ ఫాంహౌస్‌లో ఉండగా ఈ గ్యాంగ్ వారిని పాములతో బెదిరించి కాబోయే భర్తముందే బాధితురాలిని వివస్త్రను చేసి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి దోపిడీకి పాల్పడ్డది. ఈ దోపిడీని సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మే 2016లో ఏడుగురు నిందితులను దోషులుగా తేల్చారు.






