13-02-2026 01:02:41 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి మల్సూర్‌లతో మంత్రి పొంగులేటి చర్చించారు.
అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జిఓ 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలు చేసి జిఓ 103ను జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి వివరించారు.
కార్డుల జారీ ఇలా
* 2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు.
* 75 వేల నుండి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు
* 25,001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390 కార్డులు
* 15,001 నుంచి 25 వేల సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 కార్డులు
* 15వేలలోపు సర్క్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624 కార్డులతో పాటు 20 న్యూస్ ఏజన్సీలకు 68 కార్డులు
* 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానల్స్‌కు 32 కార్డులు
వంద లోకల్ కేబుల్ ఛానళ్లకు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 మం జూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రజా స్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు.