23-05-2025 12:00:00 AM
అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిగా పేరు
న్యూయార్క్, మే 22: అమెరికా అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్‌మ్యాన్-3ని పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్ స్పేస్‌బేస్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణి గంటకు 15వేల మైళ్ల వేగంతో.. 4200 కిమీ ప్రయాణించింది. చివరికి మార్షల్ ఐల్యాండ్స్‌లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరుకుంది.
ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సన్నద్ధతకు, శక్తికి చిహ్నమని అమెరికా గ్లోబ ల్ స్ట్రుక్ కమాండ్ జనరల్ థామస్ బుస్సెరీ ఒక ప్రకటనలో తెలిపారు. మినిట్‌మ్యాన్-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్‌ను అమర్చవచ్చు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది.
వాస్తవానికి మినిట్ మ్యాన్-3 క్షిపణి 1970ల నాటిది. అయితే దీనిని అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తోంది. అమెరికా గగనతల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ను నిర్వహిస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.