30 August, 2026 | 7:27 AM

‘ఫిర్జాదీగూడ’ మేయర్ కిడ్నాప్‌కు యత్నం

20-05-2024 02:28 AM

తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఆరోపణ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే19 (విజయక్రాంతి) : ఫిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస అంశంపై హైడ్రామా కొనసాగింది. ఆదివారం ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న మేయర్, కార్పొరేటర్ల వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. దాదాపు గంట పాటు తమ వాహనాలను వెంబడించి, తనను, తన కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు యత్నించారని మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఆరోపిం చారు. 20 కార్లలో వచ్చిన గుర్తు తెలియని దుండగులు తాము ఎక్కడ ఆగితే అక్కడ దాడి చేసేందుకు ప్రయత్నించి తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో అత్యంత చాకచక్యంగా ఫిర్జాదీగూడ చేరుకున్నామని జక్కా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానంలో నెగ్గేందుకు తమ పార్టీ కార్యకర్తలను లొంగదీసుకోవాలని ప్రయత్నించిందని, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు లొంగనందునే దాడి యత్నం జరిగిందన్నారు. ఫిర్జాదీగూడ మున్సిపాలిటీలో బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టి నెగ్గాలని భావిస్తోందని ఆయన ఆరోపించారు.

అందుకే ఈ దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని జక్కా వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. మేయర్ వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్పొ రేటర్లకు భద్రత కల్పించాలని డీజీపీ, రాచకొండ సీపీని కోరారు.