ఆదివాసి గిరిజన కవికి అరుదైన గౌరవం
* ఇంటర్మీడియట్ తెలుగు పార్ట్ అంశంలో మనోహర్ రాసిన వ్యాసానికి చోటు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పాత వరకు చెందిన ఆదివాసి కవి , బి.ఎడ్ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ మెస్రం మనోహర్ రచించిన వ్యాసానికి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ మనోహర్ రచించిన" నవోదయం కథల లహరి " బుక్ లోని " ప్రధాన్ ల సంస్కృతి- విశేషాంశాలు " అనే అంశంపై తెలంగాణ ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యాంశంలో చోటు దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు ఉపవాచకమైన " నవోదయం.. కథాలహరి " లోని ప్రధాన్ ల సంస్కృతి విశేషంశాలు అనే వ్యాసాన్ని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా డాక్టర్ మనోహర్ రచనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది.
ఈ వ్యాసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కే కాకుండా తెలంగాణ సాహిత్య రంగానికి గణనీయమైన గౌరవాన్ని తీసుకువచ్చిందని ఈ ప్రాంత ఆదివాసి గిరిజన అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ మెస్రం మనోహర్ గిరిజన సంక్షేమ శాఖలో తన ఉపాధ్యాయ వృత్తిని ప్రస్తావనంగా ప్రారంభించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు రాజనీతి శాస్త్రం.. ఆంగ్లంలో డిగ్రీలు సాధించారు. ప్రధాన్ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలపై పీహెచ్డీ పూర్తి చేసి, కవిగా పరిశోధకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు.
ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఉట్నూర్ సాహితీ వేదికను స్థాపించి అనేక కవులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కృషి చేశారు. ఆయన చేసిన కృషి అదిలాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రంలోని సాహిత్య లోకానికి గర్వకారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాసం పాఠ్యపుస్తకంలో చోటు దక్కడం హర్షనీయమని అన్నారు. తమ కుల దేవత నాగోబా ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.






