14 August, 2026 | 2:29 AM

సమగ్ర ప్రగతికి నిత్య దిక్సూచి!

14-08-2026 12:00 AM

‘దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ అప్పారావు పలికిన మహోన్నత సూక్తి స్వతంత్ర భారతదేశ వికాసానికి, సమగ్ర ప్రగతికి నిత్య దిక్సూచిగా నిలుస్తోంది. 1947 ఆగస్టు 15న పరాయి పాలన సంకెళ్లు తెంచుకుని స్వతంత్ర సూర్యోదయాన్ని వీక్షించిన భారతావని, తొలినాళ్లలో అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంది.

దశాబ్దాల పాటు సాగిన దోపిడీ కారణంగా ఆవహించిన నిరుపేదరికం, అజ్ఞానాంధకారం లాంటి నిరక్షరాస్యత, తీవ్ర ఆహార కొరత, పారిశ్రామిక వెనుకబాటుతనం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నాడు నవభారతాన్ని చుట్టుముట్టాయి. దేశ విభజన తెచ్చిపెట్టిన రక్తాశ్రువుల గాయాలు, కోట్ల సంఖ్యలో శరణార్థుల పునరావాస సమస్య, ఐదు వందలకు పైగా ఉన్న సంస్థానాల విలీన ప్రక్రియ, కశ్మీర్ సరిహద్దు వివాదాలు నవజాత గణతంత్రాన్ని తీవ్రంగా పరీక్షించాయి.

ఈ కల్లోలభరిత వాతావరణంలోనూ దార్శనిక నాయకత్వం ప్రజాస్వామ్య పంథాను ఎంచుకుంది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి రావడంతో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం అనే నాలుగు స్తంభాలపై భారత ప్రజాస్వామ్య సౌధం నిటారుగా నిలబడింది.

మేధావులు, సంపన్నులకే ఓటుహక్కు పరిమితమనే పాశ్చాత్య భావనలను పటాపంచలు చేస్తూ, సార్వత్రిక ప్రాయపూర్తి ఓటుహక్కును తొలిరోజే అమలు చేయడం భారత పరిపక్వతకు నిదర్శనం. జాతి, మత, ప్రాంత, లింగ వివక్షలకతీతంగా ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువనిచ్చిన ఈ నేల, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి ప్రపంచానికి సరికొత్త ప్రజాస్వామ్య నమూనాను అందించింది.

స్వతంత్ర భారత ఆర్థిక ప్రస్థానం ప్రణాళికాబద్ధ అభివృద్ధి అనే గట్టి పునాదిపై ప్రారంభమైంది. వ్యవసాయంపై ఒత్తిడిని తగ్గించి, పారిశ్రామికీకరణను వేగవంతం చేసేందుకు నీటిపారుదల ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు, విద్యుత్ కేంద్రాలు, ఐఐటీలు, పరమాణు పరిశోధనా సంస్థలు వరుసగా రూపుదిద్దుకున్నాయి. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నట్లు ఈ బహుళార్ధసాధక ప్రాజెక్టులు ‘ఆధునిక భారత దేవాలయాలు’గా మారాయి.

1960ల నాటికి తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తి, విదేశాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకునే ‘ప్లాన్ -480’ దీనస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు హరిత విప్లవం రూపుదిద్దుకుంది. శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, రాజకీయ నాయకుడు సుబ్రమణ్యం నాయకత్వంలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సమగ్ర సాగునీటి వసతులు, ఎరువుల వినియోగం రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా, భారత్ ఆహార ధాన్యాల దిగుమతిదారు స్థాయి నుంచి ఎగుమతి చేసే స్వయం సమృద్ధి రక్షకునిగా రూపాంతరం చెందింది. నేడు దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా 350 మిలియన్ టన్నులను దాటి ప్రపంచానికే ధాన్యాగారంగా విలసిల్లుతోంది.

అక్షరాస్యత రంగాన్ని పరిశీలిస్తే, 1947 నాటికి కేవలం 18 శాతంగా ఉన్న అక్షరాస్యత నేడు 78 శాతానికి పైగా పెరిగింది. ప్రైమరీ పాఠశాలల నుంచి ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్, ఎయిమ్స్ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల విస్తరణ జరిగింది. ప్రజ్ఞానమే అసలైన బలమని మన ఉపనిషత్తులు ‘సా విద్యా యా విముక్తయే‘ (ఏది విముక్తినిస్తుందో అదే విద్య) అని చాటాయి. డిగ్రీల సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా, యువతలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడం వర్తమాన అత్యవసర అంశం. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత్, ఈ యువశక్తిని నైపుణ్యవంతమైన మానవ వనరుగా మలిచితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగలదు.

ఆరోగ్య భద్రతలో భారత్ సాధించిన విజయాలు అపారం. స్వాతంత్య్రం నాటికి సగటు ఆయుర్దాయం కేవలం 32 ఏళ్లు కాగా, నేడు అది 70 ఏళ్లకు పైగా పెరిగింది. మసూచి, పోలియో, ధనుర్వాతం వంటి మహమ్మారులను దేశం నుంచి పూర్తిగా తరిమివేసింది. భారతీయ మూలికా వైద్య ప్రాశస్త్యం, ఆయుర్వేద పునాదులతో పాటు ఆధునిక అలోపతీ వైద్యాన్ని విస్తరించడం ద్వారా ‘ప్రపంచ ఔషధశాల’గా గుర్తింపు పొందింది. తక్కువ వ్యయంతో నాణ్యమైన టీకాలు, ఔషధాలను ఉత్పత్తి చేస్తూ గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ప్రాణదాతగా నిలిచింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల లేమి, నగరాలు గ్రామాల మధ్య హెల్త్‌కేర్ వ్యత్యాసాలు, ప్రైవేటు వైద్యభారం ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది.

1991వ సంవత్సరం భారత ఆర్థిక ప్రస్థానంలో మహత్తర మలుపు. విదేశీ మారక నిల్వలు అడుగంటి, తీవ్ర ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన తరుణంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తెచ్చిన ఉదారవాద, సడలింపు, ప్రపంచీకరణ సంస్కరణలు భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. పారిశ్రామిక లైసెన్స్ రాజ్‌కు స్వస్తి పలకడం, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ద్వారా భారత ఐటీ, టెలికామ్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు ప్రపంచ వేదికపై దూసుకెళ్లాయి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీ మైలురాయి సమీపంలో నిలిచింది. అయితే, కేవలం స్థూల జాతీయోత్పత్తి పెరగడమే సంక్షేమానికి కొలమానం కాజాలదు. సమాజంలో ఆదాయ అసమానతలు తగ్గి, కడపటి వ్యక్తికి కూడా ఉపాధి భద్రత, పోషకాహారం, నివాసం లభించినప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది.

సాంకేతిక శోధనలో, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో సాధించిన విజయాలు అద్భుతం. ఒకనాడు సైకిళ్లపై రాకెట్ విడిభాగాలను మోసిన పేద దేశం, నేడు అత్యల్ప వ్యయంతో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్థాయిలో జగజ్జేగీయమానంగా వెలుగుతోంది. ఆర్యభట్టతో మొదలైన ఈ నౌక, చంద్రయాన్-1, 2, 3ల ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ను చరిత్ర పుటలకెక్కించింది. మంగళయాన్, ఆదిత్య- ఎల్ ప్రాజెక్టులు భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు సజీవ సాక్ష్యాలు.

మరోవైపు, డిజిటల్ విప్లవంలో భారత్ ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచింది. ఆధార్, జన్‌ధన్, మొబైల్ అనుసంధానత సమన్వయంతో పాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సాధించిన విజయం అసాధారణమైనది. నెలకు వందల కోట్ల సంఖ్యలో సాగుతున్న నగదు రహిత లావాదేవీలు డిజిటల్ ప్రజాస్వామ్యీకరణకు అద్దం పడుతున్నాయి. రహదారులు, రైల్వేలు, మెట్రో నెట్‌వర్క్‌లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధన రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

గ్రీన్ హైడ్రోజన్, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది. అయితే, భౌతిక పురోగతితో పాటు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నిరోధం, తీవ్రమవుతున్న నగరాల కాలుష్యం, నదీజలాల శుద్ధి వంటి సమస్యలపై దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం.

వర్తమాన భారతదేశం ముందున్న ప్రధానమైన సవాలు ఉపాధి కల్పన. ఏటా శ్రమశక్తిలోకి అడుగుపెడుతున్న కోట్లాది మంది యువతకు ఉపాధి చూపాలంటే తయారీరంగాన్ని ఊహించని రీతిలో ప్రోత్సహించాలి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఉత్పాదకాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలి. వ్యవసాయాన్ని కేవలం జీవనాధార వృత్తిగా కాక, సాంకేతికత ఆధారిత వ్యాపార రంగంగా పునర్నిర్మించాలి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి భవిష్యత్తు సాంకేతికతల్లో భారత్ వినియోగదారుడిగా మాత్రమే కాక, ఆవిష్కర్తగా నిలవాలి.

‘సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః’ (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి) అనే ఆదర్శం మన భారతీయ నాగరికత పునాది. వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ, జైన ధర్మాలు, సూఫీ తత్వాలు, అహింస, భిన్నత్వంలో ఏకత్వం అనే సనాతన విలువలు భారత్‌ను ఇతర దేశాల కంటే భిన్నంగా నిలబెడుతున్నది. ప్రాచీన సంస్కృతిని కీర్తించడంతోనే ‘విశ్వగురు’ స్థానం లభించదు. పురాతన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో జోడించి, మానవాళి ఎదుర్కొంటున్న పేదరికం, రోగాలు, పర్యావరణ విపత్తులకు పరిష్కారాలు చూపినప్పుడే భారతదేశం జగద్గురువు కాగలదు.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494