వికసిత్ భారత్‌కు పరీక్షా సమయం
స్వాతంత్య్ర దినోత్సవం మనకు రాజకీయ స్వేచ్ఛను మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలను కల్పించే రాజ్యాంగబద్ధ బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. పోటీపరీక్షల నిర్వహణలో సురక్షితమైన డిజిటల్ విధానాలు, భద్రతా వ్యవస్థలు వంటి చర్యలను మరింత బలోపేతం చేయాలి.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మన దేశం సిద్ధమవుతున్న ఈ తరుణంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, భద్రత వంటి అం శాలు మరోసారి జాతీయ చర్చకు వచ్చాయి. ఇటీవల వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి వెలుగుచూసిన ఆరోపణలు, దర్యాప్తులు, న్యాయపరమైన పరిణామాలు, వాటిపై జరిగిన ప్రజా చర్చలు, న్యాయస్థానాల పరిశీలనలు దేశ యువతలో సహజంగానే ఆలోచనలు, ఆందోళనలకు దారితీశాయి.
ఇటువంటి సందర్భాల్లో ఆరోపణలు, రాజకీయ వ్యాఖ్యలు, దర్యాప్తు అంశాలు, న్యాయపరమైన పరిణామాలను వేర్వేరుగా పరిశీలించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన సమతుల్య దృక్పథం. పరీక్షా ప్రక్రియలో సమగ్రత, న్యాయబద్ధత, సమానత్వం వంటి అంశాల ప్రాధాన్యాన్ని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో తన తీర్పుల ద్వారా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి,
పరీక్షా ప్రక్రియ, డేటా భద్రత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం, పనితీరులో సంస్కరణలపై సిఫారసులు కోరింది. స్వాతంత్య్రం సాధించి దశాబ్దాలు గడిచినప్పటికీ, నాణ్యమైన విద్య, నిష్పాక్షిక నియామకాలు, పారదర్శక పరీక్షా వ్యవస్థలను మరింత బలోపే తం చేయాల్సిన అవసరం కొనసాగుతూనే ఉంది. విధానపరమైన, పరిపాలనా సంస్కరణలు అవసరమనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత ప్రతిభకు న్యాయం చేసే పరీక్షా వ్యవస్థ అత్యంత అవసరం.
జెన్ జీ, జెన్ ఆల్ఫా ఆశలు
డిజిటల్ యుగంలో పెరిగిన జెన్ జీ, వారిని అనుసరిస్తున్న జెన్ ఆల్ఫా తరాలు ప్రపంచ స్థాయి అవకాశాల కోసం పోటీ పడుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా వివి ధ పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి వెలుగుచూసిన వివాదాలు, కొన్ని పరీక్షలపై తలెత్తిన అభ్యంతరాలు, పరీక్షల రద్దు లేదా పునఃనిర్వహణ, దర్యాప్తులు వంటి పరిణామాలు పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. ఈ పరిణామాలు పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ చట్టం పబ్లిక్ ఎగ్జామినేషన్లలో మోసపూరిత చర్యలు, ప్రశ్నపత్రం లేదా సమాధాన ‘కీ’కి సంబంధించిన అక్రమ చర్య లు, కంప్యూటర్ వ్యవస్థల్లో అనధికార జోక్యం వంటి నిర్దిష్ట చర్యలను నియంత్రించేందుకు చట్టపరమైన నిబంధనలను కల్పించింది. ఉల్లంఘనలకు శిక్షలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. చట్టపరమైన చర్యలతో పాటు పరీక్షల నిర్వహణలో సాంకేతిక భద్రత, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ, సమయానుకూల ఆడిట్, సమాచార భద్రత వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు, భద్రతా ప్రమాణాల బలోపేతం ప్రజా విశ్వాసాన్ని పెంచే కీలక చర్యలుగా నిలుస్తాయి.
యువతకు భరోసా కల్పించాలి
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఎన్నో సంవత్సరాల కృషి, ఆర్థిక వ్యయం, వ్యక్తిగత త్యాగాలతో తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పరీక్షల నిర్వహణపై అనుమానాలు లేదా అనిశ్చితి తలెత్తినప్పుడు దాని ప్రభావం కేవలం ఒక పరీక్షకే పరిమితం కాదు. అది విద్యార్థుల ఆత్మవిశ్వాసం, కుటుంబాల ఆశలు, నియామక వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా ప్రభావితం చేయగలదు.
పరీక్షల ఒత్తిడి, భవిష్యత్తుపై అనిశ్చితి, నియామక ప్రక్రియల్లో ఆలస్యం వంటి అంశాలు విద్యార్థులు, ఉద్యోగార్థులపై మానసికంగా ప్రభావం చూపే అవకాశముంది. అవకాశాలపై స్పష్టత లేకపోవడం కూడా యువతలో ఆందోళనకు కారణమయ్యే ఆస్కారం ఉంది. అందువల్ల ప్రతిభ, కృషి, సమాన అవకాశాలే విజయానికి ప్రమాణాలుగా నిలిచే పరీక్షా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్య పరిపాలనలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. న్యాయబద్ధత, పారదర్శకత, సమాన అవకాశాలే యువత నమ్మకాన్ని నిలబెట్టే మూల స్తంభాలు.
దేశ భవిష్యత్తుకు బలం
స్వాతంత్య్ర దినోత్సవం మనకు రాజకీయ స్వేచ్ఛను మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలను కల్పించే రాజ్యాంగబద్ధ బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. పోటీ పరీక్షల నిర్వహణలో సురక్షితమైన డిజిటల్ విధానాలు, బహుళస్థాయి భద్రతా వ్యవస్థలు, స్వతంత్ర సాంకేతిక ఆడిట్‌లు, అవసరమైన చోట బయోమెట్రిక్ ధ్రువీకరణ, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
అలాగే పరీక్షల నిర్వహణలో పాల్గొనే ప్రతి సంస్థకు స్పష్టమైన జవాబుదారీతనం, పారదర్శకత, కాలపరిమితిలో సమీక్ష, చట్టబద్ధమైన చర్యలు ఉండాలి. రాజకీయ భేదాలకు అతీతంగా యువత ప్రయోజనాలను కేంద్రం గా ఉంచి పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా తీర్చిదిద్దగలిగితేనే వికసిత భారత్ లక్ష్యం సార్థకమవుతుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటే, ఆ యువత భవిష్యత్తుకు నిష్పాక్షికమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ ఒక కీలక ఆధారం.
కష్టానికి తగిన ఫలితం, ప్రతిభకు తగిన గుర్తింపు, చట్టానికి తగిన గౌరవం లభించే వాతావరణం ఏర్పడినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు ప్రతి యువకుడి జీవితంలో ప్రతిఫలిస్తాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి వెలువడిన వివిధ పరిణామాలను ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం, అధికారిక ప్రకటనలు,
న్యాయపరమైన పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, న్యాయస్థానాల పరిశీలనల వెలుగులో విశ్లేషించడం ప్రజాస్వామ్య సమాజంలో మీడి యా, మేధావుల బాధ్యతలో భాగమే. అదే సమయంలో, ఏ వ్యక్తి, సంస్థ లేదా అధికారిపై బాధ్యత, దోషిత్వం న్యాయస్థానాల తుది నిర్ణయాలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే నిర్ణయించాలి. ఈ ప్రాథమిక న్యాయసూత్రాన్ని గౌరవించాలి. ప్రజా విశ్వాసాన్ని కాపాడే పారదర్శక పరీక్షా వ్యవస్థ, రాజ్యాంగబద్ధ పరిపాలన, సమాన అవకాశాలే వికసిత భారత్ నిర్మాణానికి శాశ్వత పునాదులు.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9640466464






