కుల గణన విధి విధానాలకు కసరత్తు
నిపుణులు, మేధావులతో బీసీ కమిషన్ భేటీ
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కుల గణన చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంతో కుల సర్వేకు సంబంధించి విధివిధానాల కోసం బీసీ కమిషన్ కార్యాచరణ మొదలు పెట్టింది. కుల సర్వేకు సంబంధించి ప్రశ్నావళి రూపకల్పన, అవలంభించాల్సిన పద్ధతులపై ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇందుకు సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరం కృష్ణమోహన్ అధ్యక్షతన వివిధ రంగాల నిపుణులు, మేధావులతో సమావేశమై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్నారు.
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రా ల్లో నిర్వహించిన ‘కుల సర్వే’లపై లోతుగా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో కుల గణన చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, ప్రజల స్పందన, సాంకేతిక అం శాలు, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిం చారు. కుల సర్వే యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులు, మేధావులు, ప్రజా, కుల సంఘాలను ఆహ్వానిస్తామని కృష్ణమోహన్ తెలిపారు.
ఈ సమావేశంలో విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు మురళీమనోహర్, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, తిరుమలి, సింహాద్రి, పద్మజాషా, నరేంద్రబాబు, డాక్టర్ ఎస్ పృద్ధీరాజ్, దేవల్ల సమ్మయ్య, సతీశ్, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిశోర్‌గౌడ్, బీసీ కమిషన్ కార్యదర్శి బీ బాలమాయదేవి, పీపుల్స్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.






