28 August, 2026 | 11:28 PM

బడ్జెట్‌పై బిజీబిజీ

11-06-2024 12:51 AM

శాఖల వారీగా ఆర్థికమంత్రి సమీక్షలు

అంచనాలు, కేటాయింపులపై సమాలోచనలు

క్యాబినెట్ మీటింగ్  తర్వాత మరింత కసరత్తు   

వచ్చే నెల చివరలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు సన్నద్ధం

హైదరాబాద్, జూన్ 10( విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జె ట్‌ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. జులై చివరి నాటికి పూర్తిస్థాయి పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోం ది. ఈ మేరకు ఆర్థికమంత్రి శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలతో మీటింగ్‌లు నిర్వహించిన ఆర్థిక మంత్రి.. మరికొన్ని శాఖలతో సమీక్షించేందుకు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సచివాల వర్గాలు తెలిపాయి. ఈ వారంలో బడ్జెట్‌కు సంబంధించిన సమీక్షలు పూర్తి చేసి.. అనంతరం శాఖల వారీగా ప్రతిప్రాదనలను ఆర్థికశాఖ కోరనున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ..

పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో ఎన్నికల సమయంలో అచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించనుంది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణామాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేయడాన్ని సర్కారుకు సవాల్‌గా మారింది. అందుకే బడ్జెట్‌లో రూపకల్పనలో రుణామాఫీపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా? లేకుంటే ఇతర మార్గాలు ఉన్నాయా? అనే దానిపై రేవంత్ సర్కారు అన్వేషిస్తోంది. అలాగే ఆరు గ్యారంటీల అమలు కూడా రేవంత్ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు కాడా భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి. ఈ క్రమంలో సర్కారు అంచనాలను అనుకూలంగా నిధులను సమీకరించే అంశంపై ఆర్థికశాఖ ఇప్పటికే కసరత్తును మొదలు పెట్టింది.

ఆదాయం తెచ్చే శాఖలపై ఫోకస్

ప్రభుత్వానికి రాబడి పెరిగితే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యమవుతుంది. అందుకే ఆదాయం తెచ్చే శాఖలపై ఆర్థిక శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏ చేస్తే.. ఆదాయం పెరుగుతుందని, ఆయా శాఖల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని అనే అంశాలపై  కసరత్తు చేస్తోంది. ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖలో ప్రత్యేక టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి టీమ్‌లను మిగతా శాఖల్లో కూడా నియమించాలని భావిస్తోంది.

18 తర్వాత బడ్జెట్‌పై కసరత్తు ముమ్మరం

ఈ నెల 18వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల పూర్తిస్థాయి అమలుతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసు కున్న నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వ శాఖల నుంచి ఆర్థికశాక బడ్జెట్ అంచనాలను కోరనుంది. ఆ తర్వాత.. పూర్తి స్థాయి పద్దుపై కసరత్తు మరింత ముమ్మరం కానుంది. జులై చివరి వారంలో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.