అక్రమ వెంచరు.. సక్రమమెట్ల?
- నోటీసుతోనే సరిపెట్టిన అధికారులు..
- కూల్చివేతల బదులు కవరప్ ఆపరేషన్?
- కన్జర్వేషన్ జోన్‌లో కాంక్రీట్ మయం చేసి కుట్ర
చేవెళ్ల జూలై 27 (విజయ క్రాంతి) : చేవెళ్ల మండలం ఆలూరు-2లో వ్యవసాయ భూములపై ‘మై లాండ్స్ పేరిట అనుమతుల్లేకుండా సాగుతున్న రియల్ ఎస్టేట్ వెంచ్ప అధికారులు అక్రమాలను గుర్తించినప్పటికీ, కేవలం నోటీసుతోనే సరిపెట్టడం వివాదాస్పదంగా మారింది. నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధమని తేలినా, కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేవెళ్ల మండలం ఆలూరు-2 గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 51, 52, 53లో ‘మై లాండ్స్ ఫారమ్స్ పేరిట నడుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ అక్రమాలు బహిర్గతమైనప్పటికీ, అధికార యంత్రాంగం చూపిస్తున్న నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్పష్టమైన ఉల్లంఘనలు కళ్లముందు ఉన్నా, కఠిన చర్యలు తీసుకోవాల్సిన చోట నోటీసుల నాటకంతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 21న డీఎల్పీఓ సతీష్రెడ్డి, ఎంపీడీవో విఠలేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్ యాదవ్ తదితరులు వెంచర్ను పరిశీలించినప్పుడు అక్కడి అక్రమాల పరంపర ఒక్కొక్కటిగా బయటపడింది. అనుమతులు లేకుండానే మోడల్ హౌస్, కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ, రహదారులు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వరకు నిర్మించడం స్పష్టంగా చట్టానికి విరుద్ధం.
వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయించడం నేరమని అధికారులు తామే ఒప్పుకున్నా, అదే అధికారుల చేతుల్లో చర్యలు మాత్రం కనిపించకపోవడం విచిత్రం. డీటీసీపీ, హెచ్‌ఎండిఏ వంటి వాటి అనుమతులు లేకుండా ఇంత భారీ నిర్మాణాలు ఎలా జరిగాయి? ఇప్పటివరకు అధికారులు ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. వెంచర్ నిర్వాహకులకు ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం ద్వారా అధికారులు తమ బాధ్యత పూర్తయిందన్నట్టుగా ప్రవర్తించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన తర్వాత కూడా కూల్చివేతలు, కేసులు, సీజ్ చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా సడలింపు వైఖరినే సూచిస్తోంది.
అధికారుల పై అనుమానాలు..!
అక్రమ వెంచర్ వ్యవహారంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు లేవంటే అధికారుల కుమ్మక్కు లేకపోతే ఎలా? అనే ప్ర శ్నలు తెరపైకి వస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే మౌనం పాటిస్తే, అక్రమాలకు అడ్డుకట్ట ఎలా పడుతుంది? ఇప్పటికే నిర్మించిన మోడల్ హౌస్, కమ్యూనిటీ భవనాలకు అనుమతులివ్వాలని వెంచర్ నిర్వా హకులు జీపీకి దరఖాస్తు చేసుకోవడం మరింత అనుమానాస్పదంగా మార్చింది.
అక్రమమని తెలిసికూడా అనుమతి ఇస్తారా?
చట్టవిరుద్ధంగా కట్టిన నిర్మాణాలకు త ర్వాత అనుమతులు ఇస్తారా? లేక కూల్చివేస్తారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మా రింది. కంజర్వేన్షన్లోన్లో వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించి ఇప్పటికే మూడెకరాలు విక్రయిం చినట్లు సమచారం. గుంటల్లో అమ్మాకాలు, గజాల్లో రిజిస్ట్రేషన్ జరిపినా ఇ ప్పటికి రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆలూరులో అక్ర మ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న సమయంలో, ఈ కేసులో అధికారుల తదుపరి చర్యలు వారి నిజమైన నిబద్ధతను బయట పెడతాయా? లేక ఇదీ ‘నోటీసు నాటకంగానే మిగిలిపోతుందా అన్నది చూడాల్సిందే.
అనుమతి కోసం దరఖాస్తు
ఆలూరులోని ’మైలాండ్స్’ వెంచర్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న విషయాన్ని ’సూర్య’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. వెంటనే వెంచర్కు ఎంపిడీవో, డీఎల్పీవోతో పాటు నేను వెళ్లాను. అక్రమ నిర్మాణాలను పరిశీలించాము. నిర్వహకులకు నోటీసు ఇవ్వడం జరిగింది. 5 రోజులు గడువు ఇచ్చాం. ప్రస్తుతం మోడల్ హౌస్, కమ్యూనిటీ నిర్మాణంకు అనుమతి ఇవ్వాలని నిర్వహకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈవిషయం డీఎల్పీవో దృష్టికి తీసుకు తీసుకెళనున్నాను. అనుమతి ఇవాలా? వద్దా అనే విషయం ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.
నిరంజన్ యాదవ్, ఆలూరు పంచాయతీ కార్యదర్శి






