మార్కెట్ రోడ్‌లో పొంచి ఉన్న ప్రమాదం
- గుంచీలు తొలగించారు..
- విద్యుత్ కనెక్షన్లు అలాగే ఉంచారు
కేసముద్రం, జులై 27 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు గోడకు ఆనుకొని చాలా ఏళ్ల క్రితం కొందరు చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పనులు చేసుకునేవారు, వివిధ వృత్తుల పై ఆధారపడ్డవారు గుంచీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా పనులు నిర్వహించడానికి అప్పట్లో గ్రామ పంచాయతీ ద్వారా పన్ను చెల్లిస్తూ విద్యుత్ శాఖ నుండి విద్యుత్ కనెక్షన్లు పొందారు.
ఇలా చాలా ఏళ్లుగా ఉపాధి మార్కెట్ రోడ్డు ను ఆధారంగా చేసుకుని అనేక మంది జీవనం సాగిస్తుండగా, ఇటీవల రోడ్డు విస్తరణ కోసం రోడ్డుపై ఉన్న గుంచీలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నఫలంగా తొలగించారు. అయితే ఈ క్రమంలో విద్యుత్ కనెక్షన్లను తొలగించకుండా విద్యుత్ స్తంభాలకు ఎక్కడికక్కడే వేలాడదీసి వదిలేశారు. ఉపాధి పొందే గుంచీలను కోల్పోయిన వృత్తిదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. ఈ క్రమంలో విద్యుత్ కనెక్షన్లను ఎక్కడికక్కడే నిర్లక్ష్యంగా వదిలేశారు.
విద్యుత్ లైన్ కు ఉన్న పైన కనెక్షన్లు తొలగించకుండా, సర్వీస్ వైర్లను స్తంభానికి చుట్టి వదిలేయడంతో బాటసారులకు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో వర్షాలతో విద్యుత్ సరఫరా కొనసాగుతుండడంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంతవరకు వినియోగించిన సర్వీసులను షిఫ్ట్ చేయడం, లేదంటే తాత్కాలికంగా హోల్ లో పెట్టి విద్యుత్ వైర్లను తొలగించాలని కోరుతున్నారు.






