20 July, 2026 | 4:24 AM

అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి..

19-07-2026 04:56 PM

.. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోయిరె ప్రకాష్

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామ సమీపంలోని మంచిర్యాల–నాగ్‌పూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-363)పై బంబార గ్రామం వద్ద పెడెస్ట్రియన్ అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీపీఐ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోయిరె ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామం మధ్యగా హైవే వెళ్లడంతో విద్యార్థులు, గ్రామస్థులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు దాటాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు MORTH/E/2026/0027118 నంబర్‌తో ఫిర్యాదు నమోదైనట్లు వెల్లడించారు.

బంబార గ్రామం వద్ద అండర్‌పాస్‌తో పాటు బస్ షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. స్థానిక అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేకపోవడంతో కేంద్రాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 10లోపు పనులు ప్రారంభం కాకపోతే గ్రామస్తులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపడతామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.